‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా కథ రాయడానికి ఐదేళ్లు పట్టింది. సినిమా షూటింగ్ మొదలుపెట్టి సుమారు మూడేళ్లు అవుతోంది. వీటికి ఎంత కష్టపడ్డారు, ఎంతటి ప్రయాస పడ్డారు, ఎన్ని ఆలోచనలు చేశారో తెలియదు కానీ.. ఇప్పుడు వాటికి మించిన కష్టం పడాల్సిన సమయం వచ్చింది. సినిమాను ప్రేక్షకుల మధ్యకు తీసుకెళ్లడానికి ఇంకా మిగిలి ఉంది తొమ్మిది రోజులే కాబట్టి. ఇప్పటివరకు సినిమాకు చేసిన ప్రచారానికి పదింతలు ఇప్పుడు చేయాల్సి ఉంటుంది.
‘కల్కి’ సినిమా బడ్జెట్ ఎంత అంటే.. టీమ్ సరైన ఆన్సర్ ఇవ్వడం లేదు కానీ.. దాదాపు రూ. 600 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు అని అయితే అంటున్నారు. మరి సినిమాకు లాభాలు రావాలంటే మూడింతలు నిర్మాత గల్లా పెట్టెలో పడాల్సిందే అంటున్నారు. దీని కోసం టీమ్ ఏం చేస్తుంది, ఎలాంటి ఆలోచనలు చేస్తుంది అనేదే పాయింట్. అయితే సినిమా రేంజికి తగ్గ ప్రచారం చేయడం లేదు అనేది మరో పాయింట్ అనుకోండి.. దాని సంగతి టీమ్ చూసుకుంటుంది.
అయితే, ఇప్పుడు జరుగుతున్న చర్చ అయితే సినిమా టికెట్ ధర ఎంత? తెలంగాణలో అయితే ఏ సినిమాకైనా, ఎప్పుడైనా మల్టీప్లెక్స్, కొన్ని థియేటర్లలో రూ. 295 సులభంగా పెట్టేయొచ్చు. సింగిల్ థియేటర్లలో రూ. 200 వరకు ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల లెక్కలు గత ప్రభుత్వం హయాంలో చాలా మెలికలతో ఉన్నాయి. దాని కోసం ఓ జీవో కూడా తీసుకొచ్చారు అప్పుడు. దానికి భిన్నంగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు టికెట్ ధరలు ఉంటాయి అని అంటున్నారు.
ఫలానా ధర పెడతారు అనే లెక్క ఎక్కడా పక్కాగా లేకపోయినా రూ. 500 వరకు మల్టీప్లెక్స్ ధర ఉండొచ్చు అనే చర్చ నడుస్తోంది. సింగిల్ స్క్రీన్ల విషయంలో రూ. 300 వరకు ఉండొచ్చు అని సోషల్ మీడియా టాక్. ఇంత ధరతో జనాలు టికెట్టు కొని థియేటర్లకు వస్తారా? అసలు ఈ ధర నిజమేనా? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. అలాగే స్పెషల్ షోలు ఉంటాయా? ఉంటే ఎన్ని గంటలకు వేస్తారు అనేదీ చెప్పాల్సి ఉంది. ఈ వారంలోనే ఈ వివరాలు వస్తాయి అని కూడా అంటున్నారు.