‘కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు..’ ఈ సినిమా డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో కదా. ఇప్పుడు ఇదే డైలాగ్‌ని కాస్త అటు ఇటు మారిస్తే ‘కంటెంట్ లేకపోతే కటౌట్ ఉపయోగం లేదు’ అని చెప్పొచ్చు. అంతే కాదు ఈ డైలాగ్ ప్రస్తుతం టాలీవుడ్‌కి బాగా నప్పుతుంది. పట్టించుకుంటే కనువిప్పు కూడా కలిగిస్తుంది. దానికి కారణం కంటెంట్ లేకుండా కటౌట్‌ని పెట్టుకుని సినిమాను థియేటర్ల వరకు, ప్రేక్షకుల్ని స్క్రీన్ల వరకు తెస్తున్న సినిమాల టీమ్‌లు.. ఆ తర్వాత బొక్కబోర్లా పడుతున్నాయి. కొన్ని సార్లు చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు బయటపడుతున్నాయి.
Tollywood
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం, ఏ సినిమా గురించి చెబుతున్నాం అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి కూడా ఏమంత బాలేదు. బాలీవుడ్‌ను చూసి ‘మీరు వీకైపోయారు.. మీ పనైపోయింది’ అని మనం చంకలు గుద్దుకోవడం మానేసి మన మైనస్‌ల గురించి పట్టించుకోవాల్సిన సమయం వచ్చింది అని గుర్తుంచుకోవాలి. మన బుట్టలోని పళ్లన్నీ మేలిమివి అయినప్పుడు.. పక్కోడి బుట్టలో పళ్లను చూసి ఎంచాలి అనే లైన్‌ని ఇక్కడ మరచిపోకూడదు. దీనికి కారణం రీసెంట్‌గా టాలీవుడ్‌లో వస్తున్న సినిమాలు, వాటి ప్రాథమిక.. ముగింపు ఫలితాలే.
సోషల్ మీడియా ప్రచారం, పీఆర్‌వోలు నిర్మాతల్ని బెదిరించి (ఈ మాట మేం అనడం లేదు.. నిర్మాత నాగవంశీనే చెప్పారు) చేసే ప్రచారా కారణంగా వీకెండ్ ఓపెనింగ్స్ బాగుంటున్నాయి చాలా సినిమాలకు. నాలుగో రోజు నుండి అసలు రంగు బయటకు వచ్చేసరికి సినిమాల టీమ్‌లు కామ్ అయిపోతున్నాయి. ఈ పరిస్థితి ఈ ఏడాదిలో మనం చాలా సినిమాల విషయంలో చూశాం. హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్, బ్లాక్‌బస్టర్, ఇండస్ట్రీ హిట్ అంటూ వీకెండ్‌లో ఓ ఎగురు ఎగిరిన సినిమాలు కొత్త వీక్ మొదలవ్వగానే వీక్ అవుతున్నాయి.
నాలుగో రోజు సినిమా మొదటి షో చూసి.. ఫలితం తేల్చే పరిస్థితికి టాలీవుడ్ వచ్చింది. అన్నట్లు పెద్ద సినిమాలతోపాటు చిన్న సినిమాలు (బడ్జెట్ పరంగా, కాస్టింగ్ పరంగా) వస్తే ‘రిస్క్’ చేస్తున్నారు అని అనుకునేవారు మొన్నటివరకు. కానీ కంటెంట్ ఉన్న ఆ చిన్న సినిమాలు కటౌట్ ఉన్న పెద్ద సినిమాల్ని ‘పక్కకెళ్లి.. ’ అని అని వసూళ్ల రేస్‌లో దూసుకెళ్తున్నాయి. ఇదంతా చూశాక మన పరిస్థితి ఏమంత బాగాలేదు అని కచ్చితంగా అనాలని అనిపిస్తుంది.