సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో థియేటర్ వ్యవస్థ ఊపందుకోలేదు. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ లాంటి ఒకట్రెండు సినిమాలకు కలెక్షన్స్ వచ్చాయి. ‘సీటీమార్’ సినిమాకి తొలిరోజు ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ.. ఆ తరువాత మాత్రం కలెక్షన్స్ డల్ అయిపోయాయి. ఈ శుక్రవారం రెండు, మూడు సినిమాలు విడుదలైనా.. దేనికీ ఓపెనింగ్స్ సరిగ్గా లేవు. దీంతో టాలీవుడ్ దర్శకనిర్మాతల్లో టెన్షన్ మొదలైంది. థియేటర్లో మంచి సినిమాలు రావడం లేదా..? లేక జనాలు థియేటర్లకు రావడం లేదా..? ఓటీటీలకు అలవాటు పడి థియేటర్లను లైట్ తీసుకుంటున్నారా..?
అనేది అర్ధం కావడం లేదు. ఇప్పుడు వాళ్ల ఆశలన్నీ ‘లవ్ స్టోరీ’ సినిమాపైనే. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. శేఖర్ కమ్ముల సినిమాలకు స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. యూత్ మొత్తం కూడా ఆయన సినిమాలను చూస్తుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా కమ్ముల సినిమాలు నచ్చుతాయి. వారంతా ఈ సినిమా కోసమైనా థియేటర్లకు వస్తారని ఆశిస్తున్నారు. పైగా ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పాటలు, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి.
‘సారంగ దరియా’ పాట యూట్యూబ్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటికే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ‘లవ్ స్టోరీ’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. వాటి ఫలితాలు బాగానే ఉన్నాయి. ఇదే ఊపుకొనసాగితే గనుక ‘లవ్ స్టోరీ’ సినిమా థియేటర్లో ఓ రేంజ్ లో ఆడడం ఖాయం. ఈ సినిమా హిట్ అయితే దసరా సినిమాల జోరు పెరుగుతుంది. మరేం జరుగుతుందో చూడాలి!