సినిమాలో హీరో లుక్ సెట్ చేయండి అనేది దర్శకులకు పెద్ద సవాల్ అని చెప్పాలి. ఓ హీరో గత చిత్రాల లుక్స్ తో ఎటువంటి పోలికలు లేకుండా కొత్తగా ఉండాలి. ఇక సదరు స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటారు. వాళ్ళ అభిమాన హీరో వైవిధ్యంగా, సరికొత్తగా కనిపించాలని ఆరాట పడుతూ ఉంటారు. ఎన్టీఆర్,ఏ ఎన్ ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి నటులు కొన్నేళ్ల పాటు ఒకే తరహా గెటప్ లో కనిపించారు. అది వారి కాలానికి చెల్లింది. ఇప్పటి హీరోలతో పాటు, వారి ఫ్యాన్స్ సినిమా సినిమాకు లుక్ కొత్తగా ఉండాలని ఆశపడుతున్నారు. ఐతే హీరోలను కొత్తగా చూపించాలన్న ఆరాటంలో కొందరి దర్శకుల ప్రయోగాలు బెడిసికొడుతూ ఉంటాయి. టాలీవుడ్ హీరోలలో ఏ హీరో లుక్ ఏ మూవీలో విమర్శల పాలైందో ఇప్పుడు చూద్దాం..
ఎన్టీఆర్ : ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ దమ్ము. అప్పటికే రెండు వరుస ప్లాప్స్ అందుకున్న ఎన్టీఆర్ కసిగా ఈ చిత్రం చేశారు. భారీ హైప్ మధ్య విడుదలైన ఈ చిత్రం అంచనాలు అందుకోలేకపోయింది. దానితో పాటు ఈ చిత్రంలోని ‘రాజాధి.. రాజాధి…రాజా’ సాంగ్ లో ఎన్టీఆర్ వారియర్ లుక్ విమర్శలపాలైంది. ఎన్టీఆర్ ఫిజిక్ కి జులపాల విగ్ సెట్ కాలేదు. ఆడియో పరంగా అలరించిన ఆ సాంగ్ ఎన్టీఆర్ లుక్ కారణంగా విజువల్ గా ఫెయిల్ అయ్యింది.
పవన్ కళ్యాణ్: కెరీర్ ప్రారంభం నుండి ఒక్క జాని సినిమా మినహాయిస్తే పవన్ లుక్ పరంగా ఫెయిల్ అయ్యింది లేదు. ఆయన చాలా సినిమాలలో తన మార్క్ హెయిర్ స్టైల్ అండ్ లుక్ మైంటైన్ చేశారు. కాగా అజ్ఞాతవాసి చిత్రంలో ఆయన లుక్ మాత్రం కొంచెం విమర్శల పాలయింది. గత చిత్రాలకు భిన్నంగా పవన్ ఈ మూవీలో బొద్దుగా కనిపించారు. అప్పటికే పార్టీ పెట్టి పొలిటీషియన్ గా మారిన పవన్ బాడీ పరంగా శ్రద్ధ తీసుకోవడం మానేశాడు. దీనితో ఆయన అజ్ఞాతవాసిలో అంత గ్లామర్ గా కనిపించలేదు. పవన్ కెరీర్ లో భారీ నష్టాలు మిగిల్చిన చిత్రంగా అజ్ఞాతవాసి నిలిచింది.
చిరంజీవి : 2005 లో శ్రీను వైట్ల తెరకెక్కించిన అందరివాడు సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేశారు. వీటిలో మధ్య వయస్కుడైన గోవిందరాజులు పాత్రలో చిరంజీవి లుక్ ఫ్యాన్స్ కి అసలు నచ్చలేదు. మాస్ ముఠా మేస్త్రిగా ఆయన లుక్ తెరపై ఇబ్బంది కరంగా అనిపించింది. అప్పటికే చిరంజీవి వయసు అర్ధ సెంచరీకి చేరడంతో ఆయన బాగా బరువు పెరిగారు. ఆ తదుపరి చిత్రం జై చిరంజీవ లో కూడా ఆయన ఒళ్ళు చేసినట్టు కనిపించారు.
బాలకృష్ణ : రెండు దశాబ్దాలకు పైగా విగ్ తో మేనేజ్ చేస్తున్న బాలకృష్ణ, దాని కారణంగా అనేక మార్లు విమర్శల పాలయ్యారు. ఐతే ఆయన లేటెస్ట్ మూవీ రూలర్ లో పోలీస్ గెటప్ తీవ్ర విమర్శలకు గురైంది. ముఖ్యంగా పోలీస్ గెటప్ లో ఆయన పెట్టుకున్న విగ్ వీరాభిమానులకు కూడా నచ్చని పరిస్థితి. టోనీ స్టార్క్ ని తలపించేలా బిజినెస్ మెన్ గెటప్ లో ఇరగదీసిన బాలయ్య, పోలీస్ లుక్ లో మాత్రం ట్రోల్స్ కి గురయ్యారు. బాలయ్య విగ్గుల విషయంలో పూర్తి నిర్ణయం ఆయనదే కాబట్టి, ఆ క్రెడిట్ మొత్తం బాలయ్యదే.
వెంకటేష్ : వెంకటేష్ కూడా లుక్ పరంగా విమర్శలకు గురైంది తక్కువ సందర్భాలే అని చెప్పాలి. కరుణాకర్ దర్శకత్వంలో వెంకటేష్ చేసిన వాసు సినిమాలో పాష్ లుక్ చాలా మందికి నచ్చలేదు. ఇక మెహర్ రమేష్ డైరెక్షన్ లో వెంకటేష్ చేసి షాడో మూవీలో వెంకటేష్ షాడో గెటప్ విమర్శల పాలైంది. బాగా పెరిగిన జులపాల గెటప్ వెంకటేష్ కి సెట్ కాలేదు. ఆ సినిమా ఫలితం కూడా నెగెటివ్ గా వచ్చింది.
నాగార్జున : టాలీవుడ్ మన్మథుడిగా పేరున్న నాగార్జున లుక్ పరంగా ఎవర్ గ్రీన్ అంటారు. ఐతే కొన్ని సినిమాలో ఆయన లుక్ కి కూడా ప్రేక్షకులు నెగెటివ్ మార్క్స్ వేశారు. వీరభద్రం దర్శకత్వంలో 2013లో వచ్చిన భాయ్ సినిమాలో నాగార్జున గెటప్ అంతగా ప్రేక్షకులకు నచ్చలేదు. డాన్ దగ్గర పనిచేసే మాఫియా మెన్ గెటప్ ఆయనకు సూట్ కాలేదు. భాయ్ మూవీ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా జనాలకు తెలియని పరిస్థితి.
మహేష్ : టాలీవుడ్ అందగాడు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. గ్లామర్ పరంగా అమ్మాయిల రాకుమారుడిగా ఉన్న మహేష్ లుక్ కూడా కొన్ని సినిమాలో ఫెయిల్ అయ్యింది. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ అతిథి సినిమాలో బాగా పెరిగిన జుట్టుతో మహేష్ కనిపించారు. ఎర్రటి జులపాల జుట్టు కలిగిన మహేష్ గెటప్ ఒకింత విమర్శలకు గురైంది. ఆ సినిమా ఫలితం కూడా యావరేజ్ గా వచ్చింది.
ప్రభాస్ : ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహోలో ప్రభాస్ లుక్ తీవ్ర విమర్శలకు గురైంది. ఈ మూవీలో ప్రభాస్ పేస్ మునుపటి గ్లో కోల్పోయి, ఆయన భిన్నంగా కనిపించారు. ఇక ఆస్ట్రియాలోని ఆల్ఫ్స్ పర్వతాలలో తెరకెక్కించిన ‘ఏచోట నువ్వున్నా…’సాంగ్ లో ఆయన డ్రై లిప్స్ అండ్ పేస్ తో డి గ్లామర్ గా కనిపించారు. సాహో మూవీ పరాజయం కావడంలో ప్రభాస్ లుక్ కూడా ఒక రీజన్.
చరణ్ : రామ్ చరణ్ చేసిన చిత్రాల్లో ఎవడు మూవీ లోని ఆయన లుక్ విమర్శల పాలైంది. క్లీన్ షేవ్ లుక్ అనేది చరణ్ పేస్ కి అంతగా సెట్ కాలేదు. కోలముఖం కలిగిన చరణ్ కి బాగా పెరిగిన జుట్టు, ట్రిమ్డ్ షేవ్ అనేవి బాగా నప్పుతాయి. కానీ ఎవరు సినిమాలో ఆయన జుట్టు కొంచెం తగ్గించి క్లీన్ షేవ్ లో కనిపించారు. ఇక మగధీర తరువాత చరణ్ చేసిన ఆరంజ్ మూవీలో లుక్ కూడా ఆయనకు సెట్ కాలేదు.
అల్లు అర్జున్ : అల్లు అర్జున్ డెబ్యూ మూవీ గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ లుక్ చూసిన వారందరూ నవ్వుకున్నారు. ఆ సినిమాలో అల్లు అర్జున్ ని చూసిన ఎవరైనా అతను స్టార్ గా ఎదుగుతాడని అనుకోలేదు. జమీందారు కుటుంబం దగ్గర పనిచేసే పాలేరు కుర్రాడి గా అల్లు అర్జున్ లుక్ ఏమీ బాగోలేదు. అల్లు అర్జున్ అసలు హీరో మెటీరియల్ కాదనుకున్నారు.