యావత్ తమిళ సినిమా ఇండస్ట్రీ మొత్తం భుజాన వేసుకుని ప్రమోట్ చేస్తున్న సినిమా “టూరిస్ట్ ఫ్యామిలీ” (Tourist Family). మానవతా విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ మంచి అంచనాలను పెంచాయి. ముఖ్యంగా ఈ సినిమా చూసిన తమిళ సినీ పెద్దలు అందరూ “బ్రహ్మాండం” అని కితాబులిస్తూ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. ఇక ఈ సినిమా డైరెక్టర్ ఒకప్పుడు యూట్యూబర్ కావడం, ప్రీరిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీద తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ ను ప్రపోజ్ చేయడం వంటివి ఈ సినిమాకు మంచి సోషల్ మీడియా బజ్ తీసుకొచ్చాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా? అనేది చూద్దాం..!!
కథ: ధర్మదాస్ (శశికుమార్) కుటుంబంతో కలిసి శ్రీలంక నుంచి వలస వస్తాడు. తనను నమ్ముకుని వచ్చిన భార్య, ఇద్దరు కొడుకులతో చెన్నైలో ఒక కాలనీలో సెటిలవుతాడు. అక్కడి మనుషులతో ఎలా కలిసిపోయాడు? ఆ కాలనీలో మనుషులు మర్చిపోతున్న మానవత్వాన్ని తన మంచి మనసుతో ఎలా గుర్తుచేశాడు? అనేది “టూరిస్ట్ ఫ్యామిలీ” (Tourist Family) కథాంశం.
నటీనటుల పనితీరు: రీసెంట్ గా సిమ్రాన్ ఒక అవార్డ్ ఫంక్షన్ లో “ఖాళీగా ఉండడం కంటే అంటీ రోల్ ప్లే చేయడమే బెటర్” అంటూ చేసిన కామెంట్ ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోనూ ఆమె ఓ సగటు గృహిణి పాత్ర పోషించింది. కొన్నేళ్లపాటు అందాల రాణిగా అలరారిన ఆమెను ఇంత హృద్యమైన మధ్యతరగతి పాత్రలో చూడడం ఆనందాన్నిచ్చింది.
శశికుమార్ కు ఈ తరహా మంచి మనిషి పాత్రలు కొత్తేమీ కాదు. ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్న “అయోథి” చిత్రంలోనూ ఇదే తరహా పాత్ర పోషించాడు. అయితే.. ఈ చిత్రంలో కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నానంటూ కుమిలిపోయే సన్నివేశంలో అతడి నటన చాలా రిలేటబుల్ గా ఉంటుంది.
ఇక సినిమాకి స్టార్ పెర్ఫార్మర్ కమలేష్ అని చెప్పాలి. ఆ బుడ్డోడి ప్రెజన్స్ & డైలాగ్ డెలివరీ ప్రతీదీ అద్భుతంగా కుదిరింది. ఇక కామెడీ పంచులతో విశేషంగా ఆకట్టుకుని సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచాడు.
మిథున్ జైశంకర్ పాత్ర మొదట్లో పెద్దగా వర్కవుట్ అవ్వకపోయినా.. సెకండాఫ్ లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్ లో అతడు చెప్పే డైలాగ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఇక యోగిబాబు ఎప్పట్లానే చాలా సరదాగా నవ్వించాడు.
ఇక కాలనీ వాసులుగా నటించినవారందరూ మనస్ఫూర్తిగా పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు అభిషణ్ జీవింత్ ఓ సాధారణ కథను, అసాధారణంగా తెరకెక్కించిన విధానం విశేషంగా ఆకట్టుకుంటుంది. హ్యూమర్ & హ్యూమన్ ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేసిన తీరు, హాస్యంతోపాటుగా హృద్యమైన సందర్భాలను పండించిన విధానం చూస్తే ఇది ఇతనికి డెబ్యూ మూవీ అని నమ్మడం కష్టం. మనిషి జీవితం అంటే ఇలా కదా ఉండాలి? మనిషి ఇలా కదా అందరితో కలిసి బ్రతకాలి? మనిషికి మనిషి తోడుగా ఇలా కదా నిలబడాలి? అనిపించకమానదు. ఈ తరహా కాన్సెప్ట్ తో ఇదివరకు కూడా చాలా సినిమాలొచ్చాయి కానీ.. ఈ స్థాయిలో కంటతడి పెట్టించడమే కాక మనసుకి హత్తుకున్న సినిమా మాత్రం “టూరిస్ట్ ఫ్యామిలీ” అని చెప్పాలి.
ముఖ్యంగా చర్చిలో దేవుడికి నిర్వచనం చెప్పే సన్నివేశం ఎంత అద్భుతంగా పండిందంటే.. కరడుగట్టిన కర్కశ మనస్కులు సైతం కంటతడి పెట్టేంత. సినిమా ఎండింగ్ డైలాగ్ & ఎండింగ్ ఫ్రేమ్ ఒక సంతృప్తినిస్తుంది. దర్శకుడిగా అభిషణ్ తమిళ చిత్రసీమలో తిష్ట వేసుకుని కూర్చోవడమే కాదు, ఇదే తరహా మేకింగ్ తో మరికొన్ని సినిమాలు చేయగలిగితే.. అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోతాడు. ఒక డెబ్యూ డైరెక్టర్ నుంచి ఈస్థాయి సినిమా ఈమధ్యకాలంలో రాలేదు అనే చెప్పాలి.
సియాన్ రోల్డన్ సంగీతం ప్రతి ఒక్క ఎమోషన్ ను అత్యద్భుతంగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ వర్క్, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ అన్నీ సినిమాని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడ్డాయి.
విశ్లేషణ: ఓ రెండు గంటల సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వస్తున్నప్పుడు.. అప్పుడే అయిపోయిందా అనిపించడంతోపాటు మనసు తేలికగా, గుండె బరువుగా అనిపించేలా చేయడం మామూలు విషయం కాదు. “టూరిస్ట్ ఫ్యామిలీ” సినిమా కచ్ఛితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా. 2025లో భారతీయ చిత్రసీమ నుంచి వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలవడం ఖాయం.
ఫోకస్ పాయింట్: మనసుకి హత్తుకున్న మంచి సినిమా!
రేటింగ్: 4/5