‘అల.. వైకుంఠపురములో’ సినిమా తరువాత త్రివిక్రమ్ ఇప్పటివరకు మరో సినిమా రాలేదు. మహేష్ బాబు హీరోగా సినిమా అనౌన్స్ చేశారు కానీ అది ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. మహేష్ ‘సర్కారు వారి పాట’తో బిజీగా ఉండదంతో త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టలేకపోయారు. ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నారు. ఇంకా మొదలుకాని ఈ సినిమాకి డిమాండ్ మాత్రం బాగానే కనిపిస్తోంది. అది చూసి యూనిట్ కూడా రేట్లు గట్టిగానే కోట్ చేస్తోంది.
టోటల్ ఓవర్సీస్ రైట్స్ కోసం రూ.25 కోట్లు డిమాండ్ చేస్తోందట నిర్మాణ సంస్థ హారిక హాసిని. ఈ పాతిక కోట్లలో మేజర్ షేర్ అమెరికాదే ఉంటుంది. ఆ తరువాత ఆస్ట్రేలియా, దుబాయ్ ఇలా ఉంటాయి. కానీ పాతిక కోట్లు అంటే చాలా ఎక్కువ అని మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓవర్సీస్ లో టోటల్ లో సింగిల్ హోల్ సేల్ ప్లేయర్ గా ఉన్న సంస్థ రూ.20 కోట్ల వరకు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తం థియేటర్ మీద రూ.130 నుంచి రూ.140 కోట్ల వరకు రాబట్టాలన్నది హారిక హాసిని ప్లాన్. ఆంధ్ర రూ.40 కోట్లు, నైజాం రూ.40 కోట్లు, సీడెడ్ రూ.15 కోట్లు, ఓవర్సీస్ రూ.25 కోట్లు, కర్ణాటక, ఇతర ప్రాంతాలు అన్నీ కలుపుకొని రూ.130 నుంచి రూ.140 కోట్లు రాబట్టాలని లెక్కలు కడుతున్నారు. ఒక్క ఆడియో రైట్స్ నే ఈసారి రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు కోట్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు రాజమౌళి సినిమాలను పక్కన పెడితే ఇది చాలా పెద్ద మొత్తం.
హిందీ రైట్స్ కింద రూ.30 కోట్లు, డిజిటల్-శాటిలైట్ కింద రూ.50 కోట్లు ఇలా భారీ మొత్తంలో బిజినెస్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ రేంజ్ లో సినిమా రేటు పలుకుతుందో లేదో చూడాలి!