కొంతమంది దర్శకులు కొన్ని రకాల సినిమాలు మాత్రమే తీయగలరు అనే ఒక ముద్ర ఉండిపోతుంది. చాలా కాలం పాటు ఆ ముద్ర పడిపోవడంతో వేరే రకాల సినిమాలు తీయడానికి వాళ్లు ముందుకు రారు అంటుంటారు. ఒకవేళ తీసినా.. ఆ సినిమా సరైన విజయం అందుకోక మళ్లీ సేఫ్ జోన్‌లోకి అంటే అదే పాత స్టైల్ సినిమాకి వెళ్లిపోతుంటారు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అదే పరిస్థితిలో ఉన్నారా? లేక త్వరలో వచ్చేస్తారా? ఏమో ఆయన కొత్త సినిమా కాన్సెప్ట్ వింటుంటే అదే అనిపిస్తోంది.
ప్రతి దర్శకుడికీ ఒక స్టైల్ ఉంటుంది. అదే వాళ్ల బలం, బలహీనత అని చెబుతుంటారు. త్రివిక్రమ్ విషయంలోనూ అంతే. ఆయన సినిమాల్ని నిశితంగా పరిశీలిస్తే.. అందులో విజయవంతమైన సినిమాల్ని పరిశీలిస్తే ఒక పాయింట్ కామన్‌గా కనిపిస్తుంది. ఆయన నుండి వచ్చిన ఫ్లాప్‌లు సినిమాలు చూస్తే ఆ కాన్సెప్ట్ ఉండదు. అలా అని హిట్లన్నీ అదే కాన్సెప్ట్ అని చెప్పలేం. ఎక్కువ శాంత విజయాలు ఆ కాన్సెప్ట్‌తోనే వస్తున్నాయి అని చెబుతున్నాం అంతే. ఒకే కథని తిప్పి తిప్పి చూపిస్తారంటూ త్రివిక్రమ్‌కు ఓ చెడ్డ పేరు ఉంది.
అదే తాత సెంటిమెంట్ ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఓ పెద్దావిడ / పెద్దామె సెంటిమెంట్ అని చెప్పొచ్చు. ఇంకాస్త డీప్‌గా వళ్తే.. ఓ అత్త కోసం హీరో చేసిన ప్రయాణం ‘అత్తారింటికి దారేది’. అందులో తాత వల్లే అదంతా చేస్తాడు. తన తండ్రి గొప్పవాడంటూ హీరో చేసే విలువల ప్రయాణం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. అందులోనూ తండ్రి, అతని ఫ్రెండ్ కీలక పాత్రలు. తల్లి పాత్ర మెయిన్‌గా ‘అఆ’, తండ్రి – పిన్ని పాత్రల మెయిన్‌గా ‘అజ్ఞాత వాసి’, తాత — తండ్రి కాన్సెప్ట్‌లో ‘అల వైకుంఠపురములో’.
ఇలా ఏ సినిమా చూసినా అందులో పెద్ద కుటుంబం, వాళ్లంతా ఓ ఇంట్లో ఉండటం కామన్. పెద్ద ఇల్లు, ఇంటి నిండా జనాలు కామన్. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కూడా ఇలానే ఉంటుంది. గతంలో మహేష్‌తో చేసిన ‘అతడు’ కూడా అంతే. దాంతో త్రివిక్రమ్ ఈ మూసలోంచి బయటకు వస్తారా? వస్తే ఎప్పుడు? అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే ఆయన ‘అరవింద సమేత’ తీసి తాను ఎలాంటి సినిమా అయినా చేయగలను అని గతంలో చెప్పారు. అయితే అది ఒక్క సినిమాకే పరిమితం చేస్తే ఇలాంటి డౌట్లే వస్తాయి.