టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతుండటంతో సినిమాల బడ్జెట్లు అమాంతం పెరిగిపోయాయి. అదే సమయంలో హీరోలు, దర్శకులు సినిమాలకు తీసుకునే పారితోషికం విషయంలో రూటు మార్చారు. నిర్మాతలకు థియేట్రికల్ హక్కులతో పాటు శాటిలైట్, డిజిటల్, ఇతర హక్కుల ద్వారా భారీగా ఆదాయం చేకూరుతుండటంతో హీరోలు, దర్శకులు లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతి సినిమాకు రెమ్యునరేషన్ తీసుకునేవారు. ప్రస్తుతం త్రివిక్రమ్ రెమ్యునరేషన్ 25 కోట్ల రూపాయలుగా ఉంది.
అయితే మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమాకు మాత్రం త్రివిక్రమ్ పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకోనున్నారని తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ లాభాల్లో వాటా ఎంత తీసుకోబోతున్నారనే విషయం తెలియాల్సి ఉంది. త్రివిక్రమ్ చాలా సంవత్సరాల క్రితం రిజిష్టర్ చేయించిన పార్థు టైటిల్ ఈ సినిమాకు ఫైనల్ అయిందని తెలుస్తోంది. కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ లాంఛనంగా ప్రారంభం కానుంది. సినిమా టైటిల్ తో పాటు ఇతర విషయాల గురించి ఆరోజే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
2022 సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించినా అప్పటికి ఈ సినిమాను రిలీజ్ చేయడం అంత తేలిక కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి త్రివిక్రమ్ ఈ సినిమాను సమ్మర్ రేసులో నిలబెడతారో లేదో చూడాల్సి ఉంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తరువాత త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆ సినిమాను మించి సక్సెస్ సాధిస్తుందేమో చూడాల్సి ఉంది.