సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు నవంబర్ 30న మరణించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఆయన రాసిన ప్రతీ అక్షరాన్ని పుస్తకరూపంలో అందరికీ ఆంచించాలి అనే ఉద్దేశంతో దాని ఆవిష్కరణ జరిగింది. మొదటి పుస్తకాన్ని సిరివెన్నెల గారి సతీమణి పద్మావతి గారు అందుకున్నారు. గరికపాటి నరసింహారావు, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తోటకూర ప్రసాద్ విశిష్ట వంటి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మరోసారి సిరివెన్నెల గొప్పతనాన్ని తన శైలిలో వివరించారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ” సీతారామశాస్త్రి గారితో చాలా వెన్నెల రాత్రులు గడిపాను. కానీ వెన్నెల లేని ఆయన గదిలో ఆయన ధూమ మేఘాల మధ్యలో ఆయన్నే చంద్రుడిలా చూశాను చాలాసార్లు. చాలా సంవత్సరాల పాటు మరుపురాని క్షణాలు, గొప్ప గొప్ప పాటలు. నా సినిమాలోవి మాత్రమే కాదు వేరే వాళ్ళ సినిమాలో పాటలు రాసినా సరే అర్థరాత్రి ఫోన్ చేసి శ్రీను మంచి ఒక లైన్ వచ్చింది విను అని చెప్పేవారు. అలాంటి ఎన్నో గొప్ప వాక్యాలను విన్నాను. ఒక కవి పాట పాడుతున్నప్పుడు విని ఆనందించగలడం గొప్ప అదృష్టం.
అంతకు మించిన విలాసం మరొకటి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కవి గొంతు గొప్పగా లేకపోయినా.. అతని గుండె గొప్పగా ఉంటుంది. ఇప్పటికీ ఆయన పాడి వినిపించిన గొప్ప గొప్ప పాటలు నా మదిలో మెదులుతున్నాయి. ఆయనతో గడిపిన సమయం చాలా గుర్తుపెట్టుకోగలిగినది. ఆయన సినిమా పాట కన్నా ఎత్తయిన మనిషి. పాటలో ఉన్న భావం కన్నా లోతైన మనిషి. అది మనకు అర్థమైన దానికన్నా విస్తారమైన మనిషి. దానిని మనం విశ్లేషించే దానికన్నా గాఢమైన మనిషి. అలాంటి మనిషితోటి కొన్ని సంవత్సరాలు గడపటం ఆనందం.. ఇంకా కొన్ని సంవత్సరాలు గడపలేకపోవడం బాధాకరం.
కొన్ని కావ్యాలకు ముగింపు ఉండకూడదు అనిపిస్తుంది. కొన్ని పుస్తకాలకు ఆఖరి పేజీ రాకూడదు అనిపిస్తుంది. కొన్ని సినిమాలకు క్లైమాక్స్ చూడకూడదు అనిపిస్తుంది. సీతారామశాస్త్రి గారు కూడా అలాంటి ఒక కావ్యం, అలాంటి ఒక పుస్తకం, అలాంటి ఒక చిత్రం. కళ్ళకి రంగులుంటాయి గానీ కన్నీరుకి రంగు ఉండదు. అలాగే పదాలకు రకరకాల భావాలు ఉంటాయి. కానీ ఆయన వాటన్నింటిని కలిపి ఒక మనిషిగా తయారు చేసి, ఒక మనిషి గుండెకి తగిలించే బాణంలా చేసి మన మీదకు విసరగలిగిన కవిగా ఆయనను చూస్తాను.
సముద్రాల రాఘవాచార్యులు గారి దగ్గర నుంచి, పింగళి నాగేంద్రరావు గారి నుంచి, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి నుంచి, వేటూరి సుందర రామమూర్తి గారి దాకా.. తెలుగు సినిమా కవులు అంత తక్కువ వాళ్ళేం కాదు. చాలా గొప్ప స్థాయి పాటలు రాశారు వాళ్ళు. అలాంటి వాళ్ళ వృక్ష ఛాయలో ఇంకో మొక్క మొలవడమంటే దానికి ఎంత బలం ఉండుండాలి, దానికి ఎంత పొగరు ఉండుండాలి, దానికి ఎంత సొంత గొంతుక ఉండుండాలి.
తన ఉనికిని చాటడానికి ఆయన రెండు చేతుల్ని పైకెత్తి, ఆకాశం వైపు చూసి ఒక్కసారి ఎలుగెత్తి అరిచాడు. నా ఉఛ్వాసం కవనం అన్నాడు.. నా నిశ్వాసం గానం అన్నాడు. శబ్దాన్నే సైన్యంగా చేశాడు.. నిశ్శబ్దంతో కూడా యుద్ధం చేశాడు. అలాంటి గొప్ప కవి మనల్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఆయన తాలూకు అక్షరాలు మనతోనే ఉన్నాయి. ఒక గొప్ప కవి తాలూకు లక్షణం ఏంటంటే.. కాలాన్ని ఓడించడం. ఎందుకంటే ధర్మం కాలంతో పాటు మారుతుంది..
కానీ సత్యం మారదు. ఆయన సత్యాన్ని మోస్తూ వచ్చాడు. అందుకే ఆయన పాటలు ఇప్పటికీ ఎప్పటికీ మనకి రెలెవెంట్ గానే ఉంటాయి.నా సినిమాలో డైలాగ్ లాగా… అద్భుతం జరిగేముందు మనం గుర్తించం.. జరిగిన తరువాత గుర్తించాల్సిన అవసరం లేదు. సీతారామశాస్త్రి గారు నాకు తెలిసిన అద్భుతం” అంటూ మరోసారి ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పారు.