ఫస్ట్ సినిమా ‘హీరో’ తరువాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం దేవకీనందన వాసుదేవ ఇటీవల విడుదలైంది. మంచి కథతో, వినూత్నమైన కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారని అందరూ ఊహించారు. మహేష్ బాబు ప్రత్యేకంగా ఈ చిత్రానికి ప్రమోషన్ చేయడం, ప్రశాంత్ వర్మ రాసిన కథ ఆధారంగా రూపొందడం కూడా భారీ అంచనాలు కలిగించాయి. కానీ విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల అభిరుచిని అందుకోలేకపోయింది.
Prasanth Varma
కృష్ణుడు, కంసుడు, సత్యభామ మధ్య ఉండే కథను ఆధునికతతో మిళితం చేయాలని దర్శకుడు అర్జున్ జంధ్యాల ప్రయత్నించారు. అయితే కథనంలో ఆసక్తిని రేకెత్తించడంలో విఫలమయ్యారు. అశోక్ గల్లా నటన పరంగా కొంత మెరుగ్గా కనిపించినా, స్క్రీన్ ప్లే, సన్నివేశాల ట్రీట్మెంట్ పాతబడి ఉండడంతో సినిమా ఆకట్టుకోవడంలో విఫలమైంది. ముఖ్యంగా, సంభాషణలు, కామెడీ ట్రాక్, బాడీ లాంగ్వేజ్‌కు అసమతుల్యత సినిమా గ్రిప్‌ను దెబ్బతీసింది.
ఇక హనుమాన్ లాంటి విజయం అందించిన ప్రశాంత్ వర్మ ఈ కథ రాయడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. తన వద్ద ముప్పై మూడు కథలున్నాయని ఇటీవలే వెల్లడించిన అతను, ఈ సినిమా స్టోరీని జనరేషన్‌కు అనుగుణంగా మార్చినప్పటికీ, ప్రేక్షకుల మైండ్‌సెట్‌ను అందుకోవడంలో కాస్త వెనుకబడ్డారు. సినిమా కథనానికి, ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి మధ్య కనెక్ట్ లేకపోవడం సినిమా పరాజయానికి దారితీసిందని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.
ఇక విడుదలకు ముందే పుష్ప 2 లాంటి భారీ సినిమాపై ప్రేక్షకుల దృష్టి ఉండడంతో, చిన్న సినిమాలకు సరైన గుర్తింపు దక్కడం కష్టమైంది. మెకానిక్ రాకీ, జీబ్రా వంటి చిత్రాలు కూడా యావరేజ్ వసూళ్లను మాత్రమే నమోదు చేయగా, దేవకీనందన వాసుదేవకు పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. హనుమాన్ దర్శకుడికి ఈ సినిమా ఊహించని పరాజయం చవిచూడటంతో, ఈ కథను రాసినందుకు ప్రశాంత్ వర్మపై విమర్శలు రావడం మొదలైంది.
ప్రేక్షకుల మూడ్‌ను అర్థం చేసుకుని కథలను మలచాల్సిన అవసరం ఉందని ఈ ఫలితం మరోసారి రుజువు చేస్తోంది. ప్రశాంత్ వర్మ కేవలం క్రియేటివిటీతో కాకుండా, ప్రేక్షకుల అభిరుచిని కూడా పరిగణలోకి తీసుకుంటే మున్ముందు తన ప్రతిభను మరో స్థాయికి తీసుకెళ్లవచ్చు. దేవకీనందన వాసుదేవ నుండి వచ్చిన ఈ ఫలితం అందుకు ఓ మంచి గుణపాఠమని చెప్పొచ్చు.