మనిషి ఎందులోనూ తగ్గకూడదు.. అసలు తగ్గితే మనిషే కాదు. ఏంటీ మోటివేషన్ క్లాష్ తీసుకుంటున్నాం అనుకుంటున్నారా. ఇది మోటివేషన్ కామెంటే.. అయితే ఇలా చేయమని చెప్పడం కాదు.. ఇలా చేసి స్టార్ హీరోయి అయిన ఓ వ్యక్తి గురించి చెప్పే ప్రయత్నం. పెద్దయ్యాక ఈ పిల్లాడు ఏమైపోతాడో.. ఇప్పుడు కొంత డబ్బులు దాద్దాం.. ఆ తర్వాత పనికొస్తాయి అని ఓ తాత అనుకున్న మనవడి కథ ఇది. ఈ లుక్‌తో హీరో ఎలా అయిపోయాడురా.. ముఖం అద్దంలో చూసుకుని వచ్చాడా లేదా అని ట్రోలింగ్ అంటే ఎరుగని కాలంలో మాటలు పడ్డ యువకుడి కథ. ఫ్లూక్‌లో హిట్ కొట్టేశాడురా.. ఇండస్ట్రీ హిట్టంటే ఏంటో తెలుసా? అని సన్నాయి నొక్కుల బాధలు పడ్డ హీరో కథ ఇది.
ఏంటీ ఎలివేషన్లు.. మరీ అంత పొగిడేయాలా? ఎవరా హీరో అని అనుకుంటున్నారా? ఉండాలండి ఆ మాత్రం ఉండాలి. ఎందుకంటే ఈ రోజు ఆ హీరో పుట్టిన రోజు. తాత తమను వదిలి వెళ్లిపోయాక రూ.పది లక్షలు ఇన్సూరెన్స్ అందుకున్నాడు. ఇప్పుడు రూ.కోట్లు వసూళ్లు, పారితోషికాలు అందుకున్నాడు. గతేడాది రూ.300 కోట్ల పారితోషికం అందుకున్నాడు అని ఓ లెక్క. స్టైలే లేదు.. లుక్కే లేదు అని అనిన వాళ్లే స్టైలిష్ స్టార్ అని, ఐకాన్ స్టార్ అని అంటున్నారు ఇప్పుడు. ఫ్లూక్‌లో హిట్ కొట్టడం కాదు.. నేషనల్ రికార్డులను షేక్ చేసి ‘దంగల్’కి దడ పుట్టించిన హీరో అతడు. నెక్స్ట్ విదేశాలకు సినిమా వెళ్తే ‘దంగల్’ రికార్డు ఢమాల్‌మంటాయిలెండి.
ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఎవరి గురించి ఈ ఎలివేషన్లు, ఎవరి గురించి ఈ హైప్‌లు అని. బ్లాక్‌బస్టర్ బొమ్మకే మనం ఎలివేషన్లు ఇస్తాం. అంతకుమించి బ్లాక్‌బస్టర్ కెరీర్‌ను లీడ్ చేస్తున్న హీరోకు ఆ మాత్రం ఇవ్వమా చెప్పండి. ఇప్పటికే అర్థమై పోయుంటుంది ఇదంతా అల్లు అర్జున్ (Allu Arjun) గురించి అని. పైన చెప్పినవన్నీ ఆయన జీవితంలో జరిగినవే. నెపో కిడ్స్, వారసత్వం అని అంటుంటారు కదా. అవేవీ ఆయన కెరీర్ తొలినాళ్లలో కలసి రాలేదు. కలసి రాకపోగా.. అదే భారమై ఇబ్బందిపడ్డాడు కూడా. అయితే తనకంటూ ఓ దారి వేసుకొని, తనను తాను శిల్పిలా చెక్కుకుని తన మార్కును ఇండస్ట్రీ మీద వేశాడు.
కావాలంటే మీరే ఓసారి గుర్తు చేసుకొండి.. ‘గంగోత్రి’ (Gangotri) సినిమాలో అల్లు అర్జున్‌కి, మొన్నీమధ్య వచ్చిన ‘పుష్ప: ది రూల్’లో (Pushpa 2) బన్నీ లుక్‌కి ఎంత తేడా ఉందో. ఇలా మారలేక కెరీర్‌ని ఆపేసిన హీరోలను.. అందులోనూ నెపో హీరోలను చాలామందినే చూశాం. వరుస హిట్లు కొట్టుకుంటూ వస్తుంటే దర్శకుల వల్ల అయింది, కథ వల్ల అయింది అంటూ కాస్త చిన్న చూపే చూశారు బన్నీని. అయితే ‘పుష్ప’ (Pushpa) సినిమాలు పూర్తిగా బన్నీ మీదే నడిచాయి. నడిపించింది సుకుమార్ (Sukumar) అయినా.. మొత్తం అంతా బన్నీనే కనిపిస్తాడు ‘పుష్ప’రాజ్‌గా. ఆ మ్యాజిక్ నచ్చే కేంద్ర ప్రభుత్వం కూడా ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు బన్నీకి (Allu Arjun) ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం ఇచ్చింది.
అన్నట్లు ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరో అల్లు అర్జునే అనే విషయం ఈ సందర్భంలో గుర్తు తెచ్చుకోవాలి. పాత్రల ఎంపిక విషయంలో మాస్ టచ్ పట్టుకుని సర్వైవ్ అవుతున్నాడు అనే కామెంట్లను ‘రుద్రమదేవి’ (Rudramadevi) సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రతో పటాపంచలు చేశాడు. ఎంతోమంది స్టార్ హీరోలు నో చెప్పిన పాత్ర అది. బన్నీ చేయడమే కాదు.. కెరీర్‌లో బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు కూడా. ఇక హీరో పాత్ర క్లైమాక్స్‌లో చనిపోతుంది అంటే ముందుకొచ్చే హీరోలు చాలా తక్కువ మన దగ్గర. కానీ కథను, దర్శకుడిని నమ్మి ‘వేదం’లో (Vedam) కేబుల్ రాజు అయ్యాడు బన్నీ. హీరోకు నెగిటివ్ టచ్ అంటే ఇప్పుడు కామన్. కానీ ‘ఆర్య 2’లో (Arya 2) ఎప్పుడో ఆ పని చేసేశాడు. అయితే అదంతా ప్రేమ కోసమే అనుకోండి.
సెటైర్లు వేయమంటే.. హీరోలు రెడీగా ఉంటారు కానీ.. సెల్ఫ్ సెటైర్‌లు వేసే హీరోలు ఎంతమంది ఉంటారు మన దగ్గర. ‘డీజే’లో (Duvvada Jagannadham) తన పెళ్లి విషయంలో, ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) తన సినిమాల గ్యాప్ విషయంలో తన మీద తానే సెటైర్ వేసుకున్నాడు. ఇక హీరోయిన్ కాళ్లు టచ్ చేసే సీన్ చేయమంటేనే డైరక్టర్‌ని పై నుంచి కింద వరకు చూసే కథానాయకులు ఉన్న ఈ డేస్‌లో.. ఏకంగా పాత్ర పండటానికి హీరోయిన్ కాలిని గడ్డానికి రాసుకున్న హీరో ఎవరు? ఇదంతా ఎందుకండీ స్టార్ హీరో అయ్యి దేశం మొత్తం పేరు సాధించిన తర్వాత కూడా లేడీ గెటప్ వేయడానికి ముందుకొచ్చే హీరోలు ఎంతమంది మన దగ్గర. ఆఖరి రెండు పనులు ‘పుష్ప: ది రూల్’లో బన్నీ (Allu Arjun) చేశాడు అని మీకు మళ్లీ ప్రత్యేకంగా చెప్పాలా?
ఇదంతా చదివాక ‘తగ్గేదేలే..’, ‘అస్సలు తగ్గేదేలే’ అని అల్లు అర్జున్ ఎందుకు అనాలి చెప్పండి. అసలు తగ్గాలి అనే ఆలోచన ఆయనకు రాకూడదు. ఇంత సాధించాక ఎందుకొస్తుంది లెండి. అంతా చెప్పి ‘హ్యాపీ బర్త్ డే’ చెప్పకపోతే ఎలా? బన్నీ బాయ్.. హ్యాపీ బర్త్‌డే అమ్మా!