మన టాలీవుడ్ ఎప్పుడు చూసినా కన్నీళ్లు పెట్టుకునే సినిమాలు కొన్ని ఉంటాయి, ఆ సినిమాలు చూసిన రోజు మొత్తం మన మూడ్ చెడిపోయి ఉంటుంది. అందులోని సన్నివేశాలు గుర్తు చేసుకొని రోజంతా ఏడుస్తూ ఉంటాం. అలాంటి సినిమాలలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘స్నేహం కోసం’ చిత్రం. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. పెద్ద చిరంజీవి పాత్ర చూస్తే ఎలాంటి వాడికైనా ఏడుపులు రాక తప్పదు. అంత అద్భుతంగా నటించాడు ఆయన.
ముఖ్యంగా తన తల్లితో గోరు ముద్దలు తినిపించుకునే సన్నివేశం, అలాగే క్లైమాక్స్ లో తన స్నేహితుడితో కలిసి చిరంజీవి చనిపోయే సన్నివేశం, ఇప్పుడు చూసినా కూడా ఏడుపు వచ్చేస్తుంది. అంతలా ఆయన నటించాడు. ఈ చిత్రం కమర్షియల్ గా యావరేజి గా ఆడినప్పటికీ నటుడిగా మెగాస్టార్ చిరంజీవి కి ఫిలిం ఫేర్ అవార్డుని తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఎప్పుడు టీవీ లో టెలికాస్ట్ చేసిన అదిరిపోయే రేంజ్ టీఆర్ఫీ రేటింగ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ సినిమాని తొలుత ఒక మల్టీస్టార్ర్ర్ చిత్రం గా చేద్దాం అనుకున్నాడట నిర్మాత ఏ ఏం రత్నం.
రవిరాజా పినిశెట్టి ఈ చిత్రానికి (Sneham Kosam) దర్శకుడు. చిన్న చిరంజీవి పాత్ర కోసం తొలుత ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తీసుకుందాం అని అనుకున్నారట. పవన్ కళ్యాణ్ అప్పుడే ‘తొలిప్రేమ’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని ఉన్నాడు. ఈ పాత్ర ఆయనకీ ఇస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది అని, ప్రధాన పాత్రలో చిరంజీవి గారిని ముసలాయన పాత్రలో చూపిద్దాం అని అనుకున్నారట. ఈ ఐడియా చిరంజీవి కి తెగ నచ్చేసింది.
వెంటనే ఆయన ఓకే చెప్పాడు, కానీ పవన్ కళ్యాణ్ అప్పటికే ‘తమ్ముడు’ సినిమాకి కమిట్మెంట్ ఇచ్చేసి ఉన్నాడు. అందువల్ల డేట్స్ సమస్య ఏర్పడింది, రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేసేలాగా కుదురుతుందో లేదో చూసాడు, కానీ కుదర్లేదు. దీంతో రెండు పాత్రలు చిరంజీవే చేసాడు. ఈ చిత్రం 1999 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ చిత్రం తో పాటుగా ‘సమరసింహా రెడ్డి ‘ కూడా విడుదలైంది. ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ అవ్వగా, చిరంజీవి ‘స్నేహం కోసం’ యావరేజి అయ్యింది. ఒకవేళ చిరంజీవి పవన్ కళ్యాణ్ కలిసి ఈ సినిమా చేసి ఉంటే ఇండస్ట్రీ రికార్డ్స్ షేక్ అయ్యేవి అని అంటున్నారు ట్రేడ్ పండితులు.