వెబ్ సిరీస్ అంటే ఇలానే ఉండాలనే రూల్ ఏమన్నా ఉందా? అంటే లేదనే సమధానమే వస్తుంది. సినిమాలకు ఎలాంటి రూల్స్ వర్తిస్తాయో వెబ్ సిరీస్‌లకూ అంతేగా. అయితే యూట్యూబ్‌లో చెప్పే నీతి పాఠాలు, సూచనలు, సలహాలు వెబ్ సిరీస్‌ల్లో చెబితే ఎలా ఉంటుంది. ఏమో చెప్పలేం, జనాలు చూస్తారేమో అంటారా. అయితే సిద్ధమవ్వండి మరి. ఎందుకంటే ‘ఆహా’ అలాంటి ఓ సిరీస్‌ను సిద్ధం చేస్తోంది. స్టార్ డైరెక్టర్, వంశీ పైడిపల్లి ఈ సిరీస్‌ను అన్నీ తానై నడిపిస్తున్నాడట.
‘ఆహా’ను ప్రజల్లోకి ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి టీమ్ చాలా రకాలుగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌లు రూపొందించే పనిలో పడింది. అలా వంశీ పైడిపల్లి వెబ్‌సిరీస్ రాబోతోంది. వంశీ మదిలో చాలా రోజుల నుంచి ఈ ఆలోచన ఉందట. దానికి టీమ్‌తో చెప్పి ముందుకు తీసుకెళ్లాడట. ‘లూజర్’ సిరీస్ దర్శకుడు అభిలాష్ రెడ్డి, రైటర్ శ్రవణ్ భరద్వాజ్‌తో కలసి ఎనిమిది ఎపిసోడ్‌లుగా ఈ సిరీస్‌ను సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే సగం సిరీస్ స్క్రిప్ట్ సిద్ధమైపోయిందట.
మొత్తం ఎపిసోడ్స్ కంటెంట్ సిద్ధమయ్యాక అల్లు అరవింద్‌తో చర్చించి కాస్టింగ్ పనులు మొదలుపెడతారని సమాచారం. పిల్లలు ఎదిగే క్రమంలో తండ్రి ఎదుర్కొనే అనుభవాల నేపథ్యంలో సిరీస్ నడుస్తుందట. అప్పుడెప్పుడో వచ్చిన ‘ఆకాశమంత’ సినిమా స్టయిల్‌లో ఈ సిరీస్ ఉండబోతోందని అర్థమవుతోంది. అయితే ఎలా చూపిస్తారనేది తెలియాలి.