యాటిట్యూడ్.. హీరోకి అలంకారం. అయితే అది హిట్ కొట్టినప్పుడు మాత్రమే. ఈ మాట ఇప్పుడు మేం కొత్తగా చెప్పడం లేదు. గతకొన్నేళ్లుగా మన హీరోలకు ఇదే జరుగుతోంది. భవిష్యత్తులో కూడా ఇదే జరుగుతుంది. ఎందుకంటే హిట్ కొట్టినప్పుడే.. ఆ హీరో ఏం చేసినా చెల్లుతుంది. అదే సినిమా తేడా కొట్టిందా? ఇక ఆ హీరో ఏం చేసినా బూతద్దం పెట్టి చూస్తారు, అంత ఓవర్ యాక్షన్ అవసరమా అని అడుగుతారు. ఇప్పుడు విజయ్ అలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడా? అవుననే అంటోంది ‘లైగర్’ సినిమా ఫలితం.
ఒక్క సినిమా ఫలితంతో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్, కెరీర్ గురించి కామెంట్ చేసేస్తారా? అని అడగొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే.. విజయ్ దేవరకొండకు సరైన హిట్ పడి నాలుగేళ్లు దాటుతోంది. 2018లో వచ్చిన ‘గీత గోవిందం’ సినిమానే ఆఖరి భారీ హిట్. ‘టాక్సీ వాలా’ సినిమా ఫర్వాలేదనిపించినా.. సరైన వసూళ్లు అయితే రాలేదు. ఆ తర్వాత విజయ్ నుండి వరుస సినిమాలు వస్తున్నా.. వాటి ఎంపిక విషయంలో విజయ్ ఎక్కడో ఇబ్బందిపడుతున్నాడు.
అందుకే వరుసగా ‘నోటా’, ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’ సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఈ సినిమాలు చూశాక విజయ్ స్టోరీల ఎంపిక విషయంలో ఎక్కడో పొరపాటు పడుతున్నాడు అని అర్థమవుతోంది. యూత్‌ఫుల్ హీరో అంటూ తన మాటలు, చేతలతో చెబుతున్న విజయ్.. కథల ఎంపిక విషయంలో మాత్రం యూత్‌ను మెప్పించలేకపోతున్నాడు. సోషల్ మీడియాలో ప్రచారం, సినిమా ప్రచారం మీద పెడుతున్న శ్రద్ధ కథల ఎంపిక విషయంలో లేదు అని ఆయా సినిమాల ఫలితాలే చెబుతున్నాయి.
అంతేకాదు తనది కాని రోజు తగ్గి ఉండాలి అని చాలామంది సీనియర్ హీరోలు గతంలో చెప్పారు. కానీ విజయ్ దేవరకొండ ఈ విషయంలో ఎప్పుడూ తగ్గిలేడు. సినిమాలు తేడా కొడుతున్న తన యాటిట్యూడ్‌తో రెచ్చిపోతూ ఉంటాడు. ప్రేక్షకుల ముఖాన కాళ్లు పెట్టి కూర్చొని ఇంటర్వ్యూలు ఇవ్వడం, బాయ్‌కాట్ బ్యాచ్‌ని ‘చూసుకుందాం ఏమవుతుందో’ అంటూ యారెంగెంట్ మాటలు అనడం, సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు పెట్టడం లాంటివి చేస్తున్నాడు. వాటికి యూత్ నుండి రెస్పాన్స్ బాగానే రావొచ్చు. కానీ సినిమా బాగోకపోతే యాటిట్యూడ్ ఎంతచూపించినా ఉపయోగం లేదు.
కాబట్టి యూటిట్యూడ్ మీద చూపెడుతున్న శ్రద్ధ, తన రౌడీ బ్రాండ్ బిజినెస్ మీద పెడుతున్న శ్రద్ధ, సినిమాల ప్రచారం మీద పెడుతున్న శ్రద్ధ.. సినిమాల ఎంపిక విషయంలోనూ పెడితే కెరీర్‌కి మంచిదని ఓ చర్చ నడుస్తోంది. విజయ్ మంచి సినిమాలు చేసి.. యూత్ ఐకాన్‌గా ఉండాలి కానీ.. ఇలాంటి సినిమాలు చేసి ఇబ్బందులు పడకూడదని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అన్నట్లు ఇదే పూరితో ‘జేజీఎం’ ఓకే చేశాడు విజయ్. మరి ఆ కథ ఎలా ఉంటుందో. పోస్టర్ అయితే బీజీఎంఐ, సీవోడీ స్టయిల్‌లో ఉంది.