విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలో టాలీవుడ్ మోస్ట్ డిస్కష్‌డ్ హీరో, మోస్ట్ ప్రామిసింగ్ కుర్ర హీరోగా మారిపోయాడు అంటే.. దానికి అతని పీఆర్ టీమ్ కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. విజయ్ ఏం చేసినా, ఏం చెప్పాలనుకున్నా ఆ విషయం పీఆర్ టీమ్, వ్యక్తిగత సిబ్బంది ద్వారానే బయటకు వస్తుంది. ఆ మాటకొస్తే ఏ హీరో అయినా అంతే అనుకోండి. అయితే విజయ్ తన పీఆర్ టీమ్ గురించి బలంగా ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటాడు. వాళ్లు కూడా అంతే కష్టపడ్డారు.
విజయ్ ఫలానా సినిమా ఓకే చేయొచ్చు, ఓకే చేశాడు నుండి విజయ్ ఇంట్లో ఇలా ఉన్నాడు, విదేశాల్లో అలా ఉన్నాడు అంటూ అన్ని వివరాలు చెబుతూ ఉంటుంది పీఆర్ టీమ్. అయితే ‘లైగర్’ సినిమా దగ్గర నుండి పీఆర్ టీమ్ ఏం చేసినా మిస్ ఫైర్ అవుతోంది అనే అపవాదు ఉంది. విజయ్ యాంగిల్ నుండే చూస్తే.. ఈ విషయం ఇంకా క్లియర్‌గా తెలిసిపోతుంది. నిన్నటికి నిన్న విజయ్ తన కొత్త సినిమా కోసం ఏకంగా రూ. 45 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నాడు అంటూ ఓ చిన్న లీక్ వచ్చింది.
ఆ లీక్ ఇచ్చింది ఎవరో తెలియదు కానీ.. మీడియా, సోషల్ మీడియాలో మొత్తం ఈ వార్తలే. అయితే ఇందులో నిజం ఉందో లేదో తెలియడం లేదు. ‘లైగర్’ లాంటి ఫ్లాప్ పడిన తర్వాత ఆ హీరో సినిమాకు రూ. 45 కోట్లు ఇవ్వడానికి నిర్మాతలు ముందుకొస్తారా? అనే ప్రశ్న అయితే ఒకటి ఉంది. ఒకవేళ ఇస్తుంటే మంచిదే. లేకపోతే ఆ పుకారు విజయ్ కెరీర్‌కు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే ఈ విషయంలో పీఆర్ టీమ్ క్లారిటీ ఇస్తే బాగుండు అని విజయ్ అభిమానుల కోరిక.
ఈ క్రమంలో ‘రెమ్యూనరేసన్ ఎప్పుడూ ప్రచారం కాదు విజయ్’ అంటూ కొన్ని కామెంట్స్ కనిపిస్తున్నాయి. గౌతమ్ తిన్ననూరి డైరక్షన్‌లో విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. పోలీసు కథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని పోస్టర్లలోనే చెప్పేశారు. అయితే ఈ సినిమాకు విజయ్‌కు భారీ పారితోషికం ఇస్తున్నారని వార్తలొచ్చాయి. అది రూ. 45 కోట్లా కాదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే పారితోషికం విషయంలో క్లారిటీ రాదు. కానీ ఇలాంటి భారీ హైప్‌లు మాత్రం మంచివి కావు.