యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ‘వార్ 2’ (War 2) సినిమాకు సంబంధించి టీజర్ వచ్చాక తెలుగు మార్కెట్లో ఓ మోస్తరు షాక్ లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ (Jr NTR) , హృతిక్ రోషన్ (Hrithik Roshan) కాంబినేషన్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నా, దక్షిణాది మార్కెట్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ హైప్ టీజర్ తరువాత కొంత తగ్గినట్టు సమాచారం. ఇటీవల వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులపై దక్షిణాదిలో భారీ ఆఫర్లు ఊపందుకున్న తరుణంలో, వార్ 2కు రూ.75 కోట్లు వరకు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ముందుగా రెడీగా ఉన్నట్టు టాక్.
అయితే టీజర్ రిలీజ్ తర్వాత వారి నిర్ణయంలో స్పష్టమైన మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. సినిమాకి ఫైటింగ్, గ్రాండీయర్ ఉన్నా.. ఎమోషనల్ హుక్ లేదు అనే విమర్శలు వినిపించడంతో, కొంతమంది టాప్ డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి తగ్గినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ క్రేజ్ ఉంది, హృతిక్ రోషన్‌కు కూడా గుర్తింపు ఉంది. అయితే టీజర్ కేవలం యాక్షన్ మామూలుగానే చూపించిందని, కథలో కొత్తదనం ఏమిటో బైటపెట్టలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఫలితంగా టాప్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు రూ.50 కోట్లకు మించి పెట్టుబడి పెట్టలేమని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. నిర్మాతలు ఊహించిన రేంజ్‌కు ఇది చాలా తక్కువగా ఉండటంతో వారిలో టెన్షన్ మొదలైంది. ఇక మరోవైపు బాలీవుడ్‌లో మాత్రం ఈ సినిమాకు హైప్ తగ్గలేదు. హృతిక్ ఫ్యాన్స్, యశ్‌రాజ్ యాక్షన్ యూనివర్స్ మీద నమ్మకం ఉన్న వారు ఈ సినిమాను భారీ ఓపెనింగ్స్‌తో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారట.
కానీ తెలుగులో మాత్రం ప్రస్తుతం ట్రేడ్ వర్గాలు ఒక అడుగు వెనక్కి వేసి, మరింత కంటెంట్ విడుదలయ్యే వరకు వేచిచూడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వచ్చే ట్రైలర్ లోనైనా గేమ్ ప్లాన్ మారిస్తే.. ఇంకొంత బజ్ తిరిగి పెరిగే అవకాశం ఉంది. లేకపోతే తెలుగు మార్కెట్‌లో ఈ సినిమా కాస్త దూరంగా ఉండే ఛాన్స్ ఉంది.