మల్టీస్టారర్‌లు, పాన్ ఇండియా సినిమాలు అంటే.. గతంలో ఎప్పుడో కానీ వినిపించే మాట. అయితే ఇప్పుడు చాలా ఈజీగా మల్టీస్టారర్ సినిమాలు సిద్ధమవుతున్నాయి. కథలు రాయడంలో వేగం పెరిగిందో లేక అలాంటి కథల్ని ఒప్పుకోవడంలో మన హీరోలు వేగంగా ముందుకొస్తున్నారో తెలియదు కానీ.. వెంటనే వెంటనే ఇద్దరు హీరోలు కలుస్తున్నారు. ఇలాంటి వాటిలో చిరంజీవి సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ సినిమాల సంగతే చూడండి…
‘ఆచార్య’లో రామ్‌చరణ్‌తో కలసి నటించాడు చిరంజీవి. ఆ తర్వాత చేస్తున్న సినిమాల్లోనే ఇదే కంటిన్యూ అవుతోంది. మలయాళ హిట్ సినిమా ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్‌ఫాదర్’లో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆ వెంటనే చేస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ (టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు)లో రవితేజ నటిస్తున్నాడు. ఇటీవల దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా సంగతి చూడనున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ మొదలై కొన్ని షెడ్యూళ్ల షూటింగ్ కూడా జరిగింది. ఇందులో ఓ యువ హీరో పాత్ర ఉందని, సోదరిగా నటిస్తున్న కీర్తి సురేష్ సరసన నటించే ఆ పాత్ర కోసం వెతుకులాట సాగుతోంది. ఈ క్రమంలో నితిన్ పేరు బలంగా వినిపిస్తోంది. నితిన్ డేట్స్ విషయంలో చిన్నపాటి సమస్య ఉందని కూడా చెబుతున్నారు. మరి ఓకే చేస్తాడా లేదా అనేది చూడాలి. ఇలా చిరంజీవి వరుసగా మూడు సినిమాల్లోనూ కుర్ర హీరోలు, సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆసక్తిక రేపుతోంది.
నిజానికి ఆ పాత్రల కోసం చిరంజీవి వేరే హీరోలను తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ చిరు మాత్రం పాత్రలకు తగ్గట్టుగా ఉండేలా కుటుంబం నుండి కాకుండా బయటి నుండి హీరోలను తీసుకుంటున్నారట. ఈ లెక్కన ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాలు సోలోనా లేక మల్టీస్టారరా? అనేది చూడాలి.