టాలీవుడ్‌కి పెద్ద ఎవరు? అంటే సమాధానం చెప్పడం అంత సులభం కాదు. దాసరి నారాయణరావు దివికేగాక సరైన నావికుడు లేక, టాలీవుడ్ అనే పడవలో కుదుపులు వస్తున్నాయనేది ఎవరైనా చెప్పే మాట. అయితే అంతో కొంత మేర టాలీవుడ్‌ను ఓ దారిన పెట్టాలని చూసింది మెగాస్టార్ చిరంజీవి. పరిశ్రమకు, పరిశ్రమను నమ్ముకున్నవాళ్లకు ఏదైనా సమస్య వస్తే ‘నేనున్నా’ అంటూ ముందుకొస్తారు చిరు. అలా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కూడా చర్చలు జరిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. కానీ ఉన్నట్లుంది కామ్ అయిపోయారెందుకు.
చిరంజీవి ఇండస్ట్రీ విషయంలో కామ్ అయ్యి… అభిమానుల కష్టాలు తీర్చే పనిలో ఉన్నారనేది గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి బలం చేకూర్చేలా గురువారం ఓ ఘటన జరిగింది. ఇప్పటికే అదేంటో అర్థమైపోయుంటుంది. జగన్‌ను ప్రముఖ కథానాయకుడు నాగార్జున వెళ్లి కలిశారు. మామూలుగా అయితే ఇలాంటి భేటీలకు చిరంజీవి, నాగార్జున కలసి వెళ్తుంటారు. అయితే ఈసారి కేవలం నాగార్జునే వెళ్లారు. అతనితోపాటు నిర్మాతలు రంజిత్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి ఉన్నారు. దీంతో చర్చ మొదలైంది. చిరంజీవి ‘టాలీవుడ్ కాడి’ వదిలేసినట్లేనా అంటున్నారు.
అయితే ఇక్కడ రెండు రకాల చర్చలు వినిపిస్తున్నాయి. ఒకటి నాగార్జున వెళ్లింది వ్యక్తిగత విషయంగా మాత్రమేనని. టాలీవుడ్ అంశాలు చర్చకు రాలేదని అంటున్నారు. ఒకవేళ ఇండస్ట్రీ గురించి అయితే మిగిలిన నిర్మాతలు కూడా వారితో వెళ్లేవారు కదా అంటున్నారు. ఇంకో చర్చ ఏంటి అంటే… చిరంజీవికి ఇటీవల సర్జరీ అయిన కారణంగా… ప్రయాణాలు మానుకున్నారని. దీంట్లో ఏది నిజమో మనకు ఎవరూ చెప్పారు. తొలి అంశానికి అనుబంధంగా మరొకటి ఉంది. ఆన్‌లైన్ టికెటింగ్‌కి సంబంధించి మంత్రిమండలి ఆమోదం పొందిన సందర్భంలో దాని గురించే నాగ్ అండ్ కో వెళ్లారని అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఒకవేళ ఇదే అయితే చిరంజీవి ఇంకా ‘టాలీవుడ్ కాడి’ వదలనట్లే.