‘దేవర’ (Devara) సినిమా చూసి థియేటర్ల నుండి బయటకు వస్తున్న అభిమాని / ప్రేక్షకుడు మనసులో కచ్చితంగా ఉండే ఆలోచన, ప్రశ్న.. అసలు రెండో పార్టులో ఏం చూపిస్తారు? ఆ చూపించేదేదో మొదటి పార్టులోనే చూపించేయొచ్చుగా అని. వాళ్ల ఆలోచన, అనుమానం కరెక్టే. ఎందుకంటే సినిమా క్లైమాక్స్‌కి వచ్చేసరికి రెండో పార్టుకు కథను, ఆలోచనను పంపడానికి సీన్స్ రాసుకున్నారు అనిపించకమానదు. ఎందుకంటే ప్రీ క్లైమాక్స్ సీన్స్‌లో కొరటాల (Koratala Siva) పెన్ను అలా కాస్త వణికింది అని చెప్పాలి.
Koratala Siva
కావాలంటే మీరే ఓసారి ఆలోచించండి. రెండో పార్టు ఉండాలి అనే కోరికతో సినిమా క్లైమాక్స్‌ను అలా సాగదీశారు అనిపిచండం లేదు. మెయిన్ విలన్, హీరో ఎదురుపడితే సినిమా అయిపోతుంది.. ఇక రెండో పార్టుకు అవకాశం లేదు అని అనుకున్నారేమో ఆయన్ను రిటైర్డ్ హర్ట్ కింద పక్కనపెట్టేశారు. దీంతో క్లైమాక్స్‌లో మజానిచ్చే పోరు మిస్ అయ్యాం. అయితే ఏముంది రెండోపార్టులో చూసుకోవచ్చులే అని అనొచ్చు. అయితే అసలు ట్విస్ట్ రివీల్ అయ్యాక మెయిన్ విలన్‌తో ఫైట్ మజా ఏమొస్తుంది.
ఇదొక్కటే కాదు.. సినిమాలో కొన్ని సన్నివేశాలు రిపీట్ మోడ్‌లో, అడ్జెస్ట్ మూడ్‌లో కనిపిస్తాయి. అంటే కథను సాగదీయడానికి కొన్ని సన్నివేశాలు రాశారు అనిపిస్తుంది. వాటికి బదులు అసలు కథ ఏదో చూపించేసి ఉంటే సెకండాఫ్ విషయంలో బోరింగ్, ల్యాగ్ అనే విమర్శలు వచ్చేవి కావు. అలానే హీరోయిన్ అంతసేపు దాచేశారు అనే అపవాదూ వచ్చేది కాదు. ఇక్కడే ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao) చెప్పిన ఓ విషయం గమనించాలి.
సినిమా ప్రారంభమైన పది, పదిహేను నిమిషాల్లో హీరోయిన్ ఎంట్రీ ఉండాలి. లేదంటే ప్రేక్షకుడు ఇబ్బందిగా ఫీల్ అవుతాడు అని రాఘవేంద్రరావు ఎప్పుడో చెప్పారు. ఈ సినిమా విషయంలో అది జరగలేదు. అలా అని బోర్ కొట్టిందా అంటే లేదు. కానీ రెండో భాగం కోసం సాగదీసినట్లు అయింది. ఇదంతా చూస్తుంటే సీక్వెల్ మోజులో కొరటాల తాను ఇబ్బంది పడ్డారు.. జనాలను ఇబ్బందిపెట్టారు అని చెప్పాలి.