తెలుగువారి అభిమాన దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా అనగానే నందమూరి అభిమానులందరూ ఎగిరి గంతేశారు. సినిమా ఎప్పుడు మొదలవుతుందా? అని ఎదురు చూసారు. కానీ నిన్నటితో వారి ఆలోచనలో మార్పు వచ్చింది. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా చేయకుంటే మంచిదని అనుకుంటున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కిన అజ్ఞాతవాసి నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయింది. త్రివిక్రమ్ మీద నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు కోట్లు వెచ్చించి ఈ సినిమాని కొనుగోలు చేశారు. పండుగల వల్ల, అధిక షోల వల్ల వారికి ఆర్థికపరమైన నష్టం ఏమి రాదు. కానీ త్రివిక్రమ్ కి భారీ నష్టం జరిగింది. తన బ్రాండ్ వ్యాల్యూ ని అజ్ఞాతవాసి సగానికి దించేసింది. రైటర్, డైరక్టర్ గా.. రెండు విభాగాల్లోనూ పూర్తిగా ఫెయిల్ అయ్యారు.
పైగా ఫ్రెంచ్ సినిమాని కాపీ చేసి.. తనపైన ఉన్న గౌరవాన్ని పోగొట్టుకున్నారు. గత సినిమా అ.. ఆ సినిమా కథను కాపీ కొట్టి మచ్చ తెచ్చుకున్న త్రివిక్రమ్.. దాన్ని చెరిపేసుకునే ప్రయత్నం చేయకుండా అజ్ఞాతవాసితో ఉన్న అభిమానాన్ని కోల్పోయారు. ఈ ప్రభావం త్రివిక్రమ్ చేయబోయే నెక్స్ట్ సినిమాపై తప్పక ఉంటుంది. ఈ సినిమా ఎలా ఉంటుందోనని భయం డిస్టిబ్యూటర్స్ లో ఉండడం వల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తగ్గే అవకాశం ఉంది. ఈ విమర్శలను, ఆందోళనలు, అనుమానాలను పోగొట్టేందుకు త్రివిక్రమ్ మరింత శ్రమించాల్సి ఉంటుంది. అలా కష్టపడి సొంత కథతో మంచి సినిమాని అందించాలని అటు నందమూరి అభిమానులు, ఇటు త్రివిక్రమ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.