విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామారావు నట జీవితంలో ఎన్నో అపురూపమైన, అద్భుతమైన చిత్రాలు, తన అసమాన నటనతో ప్రాణం పోసిన సాహసోపేతమైన పాత్రలు ఉన్నాయి. నటుడిగా, దర్శకుడిగా, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల్లో తనదైన ముద్రవేశారాయన. ఇక రాముడు, కృష్ణుడు వంటి పాత్రలతో తెలుగు ప్రేక్షకాభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారాయన. ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘యమగోల’ చిత్రం 1977 అక్టోబర్ 21న విడుదలైన ఈ మూవీ 2022 అక్టోబర్ 21 నాటికి 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.
అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్, జయప్రద ప్రధాన పాత్రల్లో.. తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ‘యమగోల’ తో అప్పటివరకు కెమెరామెన్ గా ఉన్న వెంకటరత్నం.. పల్లవీ ఫిల్మ్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారారు. కథ యమలోకం చేరుకున్నప్పట నుండి సినిమా గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది. యముడిగా కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్యల నటన అమోఘం. వాళ్లు భూలోకం వచ్చిన తర్వాత జరిగే సీన్స్ అయితే హైలెట్ అసలు.
సత్యం పాత్రలో యముడితో పోటాపోటీగా వచ్చే ఎన్టీఆర్ సీన్స్ అలరిస్తాయి. అప్పటి పాలిటిక్స్ పై సినిమాలో వేసిన సెటైర్స్ ను కూడా ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. సత్యం యమలోకంలో తీసుకొచ్చే రివల్యూషనరీ సీన్స్ అయితే భలే ఉంటాయి. ముఖ్యంగా కె.చక్రవర్తి సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు విన్నా కూడా ఫ్రెష్ గా అనిపిస్తాయి.
‘ఓలమ్మీ తిక్కరేగిందా’, ‘చిలక కొట్టుడు కొడితే చిన్నదానా’, ‘ఆడవె అందాల సురభామిని’, ‘గుడివాడ వెళ్లాను.. గుంటూరు పోయాను’, ‘సమరానికి నేడే ప్రారంభం’, ‘వయసు ముసురుకొస్తున్నది’ సాంగ్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంటుంది. ‘యమగోల’ 45 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ సినిమా విశేషాలను షేర్ చేసుకుంటున్నారు.