ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో టికెట్ రేట్లను తగ్గించడంతో ఆ ప్రభావం టాలీవుడ్ సినిమాలపై పడుతుండటం గమనార్హం. జగన్ నిర్ణయం వల్ల రాబోయే నాలుగు నెలల్లో టాలీవుడ్ ఏకంగా 100 కోట్ల రూపాయలు నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. డిసెంబర్ నుంచి వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ కానుండగా తగ్గిన టికెట్ రేట్ల వల్ల బాలయ్య నటిస్తున్న అఖండ సినిమాపై మొదట ప్రభావం పడనుందని తెలుస్తోంది.
డిసెంబర్ 2న అఖండ రిలీజ్ కానుందని వార్తలు వస్తుండగా ఏపీ, సీడెడ్ హక్కులు 47 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని టికెట్ రేట్ల తగ్గింపు వల్ల నిర్మాత 38 కోట్ల రూపాయలకు తగ్గించారని తెలుస్తోంది. పుష్ప సినిమాకు ఈ ఏరియాలలో 85 కోట్ల రూపాయల స్థాయిలో బిజినెస్ జరగగా టికెట్ రేట్ల తగ్గింపు వల్ల 15 కోట్ల రూపాయల వరకు తగ్గింపు ఉండనుందని సమాచారం. ఏపీలో ఆర్ఆర్ఆర్ సినిమా హక్కులను కూడా 28 కోట్ల రూపాయలు తగ్గించి 112 కోట్ల రూపాయలకు మార్కెట్ చేశారని తెలుస్తోంది.
సంక్రాంతి సినిమాలు, ఆచార్య, ఎఫ్3 సినిమాలపై కూడా టికెట్ రేట్ల తగ్గింపు ప్రభావం పడుతోంది. టికెట్ రేట్ల పెంపు గురించి త్వరలో ప్రకటన వస్తుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నా ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. మరోవైపు త్వరలో ఏపీలో ఆన్ లైన్ ద్వారా టికెట్లు విక్రయించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ విడుదలయ్యే సమయానికి ఏపీలో టికెట్ రేట్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ ఏకంగా 200 కోట్ల రూపాయల బిజినెస్ చేయడం గమనార్హం.