ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోయాయి. ఆకర్షణీయమైన ప్రకటనలతో యువతను ఉద్దేశించి ఈ యాప్స్ విస్తరించడంతో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే అనేక మంది ప్రముఖులను విచారణకు పిలవడంతో పాటు, సోషల్ మీడియాలో వీటిని ప్రమోట్ చేసిన వారి జాబితా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మియాపూర్ పీఎస్‌లో టాలీవుడ్ సినీ ప్రముఖులపై (Celebrities) కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. తాజాగా, టాలీవుడ్ నుంచి రానా దగ్గుబాటి (Rana Daggubati), మంచు లక్ష్మి (Manchu Lakshmi) , నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), ప్రకాష్ రాజ్ (Prakash Raj), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), అనన్య నాగళ్ల (Ananya Nagalla), ప్రణీతలపై (Pranitha Subhash) కేసులు నమోదయ్యాయి.
అలాగే బుల్లితెర సెలబ్రెటీలు శోభాశెట్టి, సిరి హనుమంతు (Siri Hanumanth), నయని పావని (Nayani Pavani), శ్రీముఖి (Sreemukhi), యాంకర్ శ్యామల, వసంత కృష్ణ, అమృత చౌదరి, ఇమ్రాన్ ఖాన్ సహా 25 మందిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. డబ్బులు తీసుకొని తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకుగాను వీరిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు 11 మంది యాంకర్లు, యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు.
టేస్టీ తేజ, విష్ణుప్రియ (Vishnupriya), హర్ష సాయి, పరేషాన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్ ఖాన్ సహా పలువురిని విచారణకు పిలిపించారు. వారిపై 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 కింద కేసులు బుక్ చేశారు. ఇప్పటివరకు కొంతమందిని అరెస్ట్ చేయగా, మరికొందరు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులు నమోదవ్వడంతో గతంలో బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసిన పలువురు ప్రముఖులు (Celebrities) క్షమాపణలు చెప్పడం గమనార్హం. తెలియక చేసిన తప్పుకు బాధపడుతున్నామని చెబుతున్నా, చేసిన తప్పుకు శిక్ష పడాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
న్యాయపరమైన విచారణ కొనసాగుతున్న వేళ, మరిన్ని పేర్లు బయటకు వస్తాయా అనే ఉత్కంఠ నెలకొంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఈ కేసుల్లో ఇరికిపోవడంతో, ఇండస్ట్రీలో కలకలం రేగింది. చిన్నపాటి సోషల్ మీడియా ప్రమోషన్లు కూడా ఎంతటి ప్రమాదాన్ని తీసుకురావచ్చో ఈ కేసులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇకపై మరెవరికీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి, ప్రభుత్వం ఇంకా కఠినమైన చర్యలు తీసుకునే అవకాశముంది.