గతవారం విడుదలైన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోతుంది. ఇంద్రగంటి రూపొందించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చినప్పటికీ.. థియేటర్ కి జనాలు రావడం లేదు. తొలి మూడు రోజుల్లో ఈ సినిమాకి కనీసపు కలెక్షన్స్ కూడా రాలేదు. సినిమాలో సరైన కంటెంట్ లేకపోవడం, స్లోగా సాగడం ఇలా సినిమా దెబ్బ తినడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం దాదాపు రూ.12 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కావడంతో నాన్ థియేట్రికల్ హక్కులు పర్వాలేదనిపించాయి. కానీ థియేటర్ హక్కులను టైంకి అమ్మలేకపోయారు. మొదట ఎక్కువ రేటు చెప్పారు. ఆ తరువాత అడ్వాన్స్ ల మీద విడుదల చేయాల్సి వచ్చింది. దీంతో దాదాపు రూ.3 కోట్ల వరకు నిర్మాతలకు నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాతో పాటు విడుదలైన ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’, ‘శాకిని డాకిని’ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యాయి.
‘శాకిని డాకిని’ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ముందుగానే అమ్మేయడంతో నిర్మాతలకు నష్టం లేకపోయింది. ఇక ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా థియేటర్ హక్కులు అమ్మేశారు కానీ నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుకాలేదు. దాంతో ఈ సినిమాకి కూడా నష్టాలు తప్పేలా లేవు.
ఈ మూడు సినిమాలతో పాటు విడుదలైన కొన్ని చిన్న సినిమాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక ఈ వారం మరికొన్ని చిన్న సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. కనీసం ఈ వారమైనా బాక్సాఫీస్ వద్ద సందడి కనిపిస్తుందేమో చూడాలి!