తమిళంలో… ఓ యూట్యూబర్ గా కెరీర్ ను మొదలుపెట్టాడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఆ తర్వాత అక్కడి స్టార్ హీరో జయం రవిని (Jayam Ravi) ఇంప్రెస్ చేసి ‘కోమాలి’ (Comali) అనే సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. కాజల్ (Kajal Aggarwal) అందులో హీరోయిన్. తక్కువ బడ్జెట్లోనే తీసిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్ల వరకు కలెక్ట్ చేసి నిర్మాతకి భారీ లాభాలు అందించింది. దీంతో నిర్మాత కృతజ్ఞతతో అతనికి కార్ కొని పెట్టడానికి రెడీ అయితే.. ‘నాకు ఇది వద్దు.
దానికి డీజిల్ వంటివి కొట్టించి మెయింటెయిన్ చేసే స్తోమత నాకు లేదు. కాబట్టి ఆ కార్ ఎంత విలువ చేస్తుందో.., అంత డబ్బు నాకు ఇచ్చేయండి’ అని డబ్బులు తీసుకుని.. తన అప్పులు వంటివి తీర్చుకున్నాడట ప్రదీప్. ‘అతను ఎంత కాలిక్యులేట్ గా ఉంటాడు?’ అనేందుకు ఉదాహరణ అది. ఆ తర్వాత హీరోల కోసం ఏమీ ఎదురు చూడలేదు. తనకి సరిపడా కథ రాసుకుని చేసి పెద్ద హిట్టు కొట్టాడు. అదే ‘లవ్ టుడే’(Love Today). ఈ సినిమా కూడా భారీ లాభాలను అందుకుంది.
ఇక దీని తర్వాత కూడా గ్యాప్ తీసుకుని ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return of the Dragon) అనే సినిమా చేశాడు. చాలా సైలెంట్ గా నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది. నిన్న అంటే మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.11 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. చూస్తుంటే ఫుల్ రన్లో ఈ సినిమా కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.