ఏఎన్ఆర్ సూపర్ స్టార్ కృష్ణ మధ్య ఒకానొక సంధర్భంలో విభేదాలు తలెత్తాయి. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక ఆ విభేదాలు కూడా ఒకే ఒక సినిమా విషయంలో వచ్చాయి. ఏఎన్ఆర్ కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా దేవదాస్. ఈ సినిమానే ఏఎన్ఆర్ ఇండస్ట్రీలో ఒకడిగా నిలబెట్టింది. అయితే ఈ సినిమా అనుకున్నప్పుడు ఏఎన్ఆర్ వల్లే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని విమర్శించారు. అప్పటి వరకూ కత్తి పట్టి జానపద చిత్రాలలో నటించిన అక్కినేని ప్రేమికుడి పాత్రలో లవర్ బాయ్ గా మెప్పిస్తాడా అని అనుమానం వ్యక్తం చేశారు.
కానీ ఏఎన్ఆర్ (ANR) మాత్రం ఆ పాత్రను సవాల్ గా తీసుకుని నటించారు. అంతే కాకుండా ఈ సినిమా కోసం తాగకపోయినా తాగినవారిలా నటించడం ఎలా అని నానా ప్రయోగాలు కూడా చేశారు. ఈ సినిమాకు మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ రెండో రోజు రిజల్ట్ మారిపోయింది. ఇక ఈ సినిమా అంటే అక్కినేనికి కూడా చాలా ఇష్టమట. తాను బ్రతికి ఉండగా దేవదాసు సినిమాను ఎవరూ రీమేక్ చేసి లేదా సీక్వెల్ తీసి చెడగొట్టకూడదని అనుకున్నారట.
కానీ సరిగ్గా దేవదాసు సినిమా వచ్చిన ఇరవై ఏళ్లకు తాను దేవదాస్ సినిమాను మళ్లీ తెరకెక్కిస్తానని కృష్ణ ప్రకటించారు. సినిమా కలర్ లో ఉంటుందని విజయనిర్మల హీరోయిన్ గా నటిస్తారని ప్రకటించారు. అంతే కాకుండా సినిమాను విజయ నిర్మల దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో పూర్తి చేసి విడుదల చేసారు. కానీ దానికి సరిగ్గా వారం రోజుల ముందు అక్కినేని పాత దేవదాస్ సినిమా రైట్స్ ను కొనుగోలు చేసి కృష్ణ దేవదాసు సినిమాకు పోటీగా విడుదల చేశాడు. రెండు సినిమాలు కంపేర్ చేసిన ప్రేక్షకులు ఏఎన్ఆర్ దేవదాసు సినిమాకే ఓటువేశారు.
దాంతో కృష్ణ దేవదాస్ సినిమా బాగోలేదనే టాక్ వచ్చింది. ఇదంతా జరిగిన సమయంలో అక్కినేని అమెరికాలో ఉన్నా అక్కడనుండే చక్రం తిప్పారు. ఇక అమెరికా నుండి వచ్చిన ఏఎన్ఆర్ ను ప్రెస్ వాళ్లు ప్రశ్నల వర్షం కురిపించారు. కృష్ణ దేవదాసు సినిమాకు పోటీగానే మీరు మీ దేవదాసు సినిమాను విడుదల చేశారా అంటూ ప్రశ్నించారు. దానికి ఏఎన్ఆర్ మాది ఇరవై ఏళ్ల కిందట వచ్చిన సినిమా కృష్ణ గారిది కలర్ సినిమా కాబట్టి నేనే భయపడాలి..అయినా కృష్ణ గారితో నాకు పోటీ ఏంటి..నా స్టేటస్ వేరు. ఆయనతో పోల్చుకుని నా స్థాయిని దిగజార్చుకోను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.