తనకు బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడికి హీరోలు గౌరవం ఇస్తుంటారు. అదేంటి ఫ్లాప్ ఇచ్చిన వాళ్లను పట్టించుకోరా అంటే.. పట్టించుకుంటే బాధ పెరుగుతుందని వదిలేస్తారు. ఆ విషయం పక్కన పెడితే తనకు హిట్ ఇచ్చిన, ఇప్పుడు అదిరపోయే (వాళ్ల లెక్కలో) సినిమా ఇచ్చిన ఓ దర్శకుడిని ఇద్దరు స్టార్ హీరోలు ఆకాశానికెత్తేశారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రధానపాత్రలో ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ (A.R. Murugadoss) తెరకెక్కించిన చిత్రం ‘సికందర్’ (Sikandar).
రష్మిక మందన (Rashmika Mandanna) కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 30న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం వరు ఇంటర్వ్యూలు, ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. భద్రతా కారణాల రీత్యా సల్మాన్ బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో క్లోజ్డ్ డోర్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అలా ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో మరో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) పాల్గొన్నాడు.
అప్పుడు తీసిన ఓ ఫొటోను చిత్రబృందం ‘ఒకే ఫ్రేమ్‌లో సందడి చేస్తున్న అద్భుతమైన వ్యక్తులు’ అనే కామెంట్ రాస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో దర్శకుడు మురుగదాస్‌ను సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఎత్తుకొని ఉన్నారు. ‘రమణ’, ‘గజిని’ (Ghajini), ‘తుపాకి’ (Thuppakki), ‘కత్తి’ (Kaththi) లాంటి సినిమాలతో తిరుగులేని బ్లాక్ బస్టర్ దర్శకుడిగా ఏఆర్ మురుగదాస్కు (AR Murugadoss) పేరు. బాలీవుడ్‌లో ‘గజిని’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టారు కూడా.
అయితే మహేష్‌బాబు (Mahesh Babu) ‘స్పైడర్’ (Spyder) తర్వాత మురుగదాస్ (AR Murugadoss) పరిస్థితి దారుణంగా మారిపోయింది. దీంతో ‘సికందర్’ సినిమా ఫలితం ఆయనకు చాలా కీలకం అని చెప్పాలి. ఇక సల్మాన్‌కి కూడా విజయం వచ్చి చాలా ఏళ్లయింది. కాబట్టి ‘సికందర్’తో ఆయన సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వీరికి ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. రష్మిక మందన ఇప్పుడు వరుస విజయాలతో హ్యాట్రిక్ ముంగిట ఉంది. ‘సికందర్’తో ఆ ఫీట్ సాధిస్తుందేమో చూడాలి.