విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘దాస్ క ధమ్కీ’ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సం ముగిసిన తర్వాత ఎన్టీఆర్ హాజరైన మొదటి సినీ వేడుక ఇది. ఈ వేడుకలో ఆస్కార్ అనుభవాలను కూడా ఎన్టీఆర్ అందరితో పంచుకున్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈసారి కూడా చరణ్ పేరు చెప్పకుండా ఎన్టీఆర్ దాటేశాడు. ఎన్టీఆర్ మాట్లాడుతూ… ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఈరోజు ప్రపంచపటంలో నిలబడిందంటే.. ఆస్కార్ అవార్డుని చేజిక్కించుకుంది అంటే..
దానికి మా జక్కన్న రాజమౌళి గారు ఎంత కారణమో.. కీరవాణి గారు ఎంత కారకులో.. చంద్రబోస్ గారు ఎంత కారకులో.. పాట పాడినటువంటి కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఎంత కారకులో.. ఆ పాటకు కొరియోగ్రఫీ చేసినటువంటి ప్రేమ్ రక్షిత్ ఎంత కారణమో వీళ్లందరితో పాటు యావత్ తెలుగు చిత్రసీమ అలాగే భారతదేశపు చిత్ర సీమ కూడా ఎంతో కారణం.. యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో కారణం.. వాళ్లందరితో పాటు మీ అభిమానం(ఫ్యాన్స్) ఎంతో కారణం..
ఆ అవార్డు సాధించింది మేము కాదు మీరు సాధించారు..! మీ అందరి తరఫున మేము అక్కడ నిలబడ్డాం. ఆస్కార్ స్టేజి పై కీరవాణిగారిని, చంద్రబోస్ గారిని చూస్తుంటే ఇద్దరు భారతీయులను చూసినట్టు అనిపించింది.వాళ్లలో ఇద్దరు తెలుగు వాళ్ళు కనిపించారు. ఆ స్టేజ్ మొత్తం తెలుగుతనంతో నిండిపోయింది. ఆస్కార్ అవార్డు రావడానికి మీ అందరితో పాటు ముఖ్యమైన కారణం మీడియా ప్రతినిధులు, మీడియా మిత్రులు, కేవలం మన తెలుగు రాష్ట్రాల మీడియా మిత్రులే కాదు, భారతదేశపు మీడియా వాళ్ళందరూ కూడా ‘ ‘ఆర్.ఆర్.ఆర్’ ను ఇది మన సినిమారా ఇది.
మన తెలుగు సినిమారా ఇది అని అక్కరకు చేర్చుకుని దీనిని ప్రమోట్ చేశారు.థాంక్యూ సో మచ్’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతమందికి థాంక్స్ చెప్పిన ఎన్టీఆర్.. చరణ్ గురించి చెప్పకపోవడం మెగా అభిమానులను హర్ట్ చేసిందనే చెప్పాలి. ఆస్కార్ అవార్డు వచ్చిన రోజునాడు కూడా ఎన్టీఆర్ చరణ్ పేరుని ట్యాగ్ చేయలేదు. దీంతో ఎన్టీఆర్ కు ఇన్సెక్యూరిటీ పెరిగిపోయిందా అనే కామెంట్లు కూడా మొదలయ్యాయి.