సినిమా పరిశ్రమకు చేసిన సేవలకు అజిత్‌కి (Ajith) కేంద్ర ప్రభుత్వం దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారమైన పద్మ భూషణ్‌ను ప్రకటించింది. దీనిపై అజిత్ (Ajith) తొలిసారి స్పందించారు. ఈ సంరద్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలో తన తండ్రిని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు అజిత్.
పద్మభూషణ్ పురస్కారానికి నన్ను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నాను. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పురస్కారం నాకు కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదు. ఎంతోమంది సమష్టి కృషి, మద్దతుకు నిదర్శనం. నా ఇన్నేళ్ల కెరీర్‌లో సినిమా పరిశ్రమలో ఎంతోమంది నాకు సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు అని పోస్టులో రాసుకొచ్చాడు అజిత్ (Ajith) .
అందరి ప్రేరణ, సహకారం, మద్దతుతోనే నేనీ స్థాయిలో ఉన్నాను. ఎన్నో ఏళ్లుగా రేసింగ్, షూటింగ్‌లో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. రోజును నాకు దక్కిన గౌరవాన్ని చూడటానికి నా తండ్రి జీవించి ఉంటే బాగుండేది. నన్ను చూసి ఆయన గర్వపడేవారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా.. నాకు దక్కిన గౌరవాన్ని ఆయన చూస్తుంటారు అనే అనుకుంటున్నాను’’ అంటూ రాసుకొచ్చారాయన.
అదే సమయంలో తన భార్య షాలిని గురించి కూడా మాట్లాడాడు అజిత్. 25 ఏళ్ల నుండి నా భార్య షాలిని సహకారం అందిస్తోంది. నా విజయానికి, సంతోషానికి ఆమెనే ప్రధాన కారణం. అభిమానుల ప్రేమ, మద్దతుతోనే నేను ఇలా డెడికేషన్‌గా పని చేయగలుగుతున్నాను. ఈ అవార్డు మీ అందరిది. మీ అందరికీ వినోదాన్ని అందించడానికి ఇలానే కష్టపడతాను అని అజిత్ ఆనందంతో ఆ పోస్ట్ రాసుకొచ్చారు.
35 ఏళ్ల సినీ ప్రయాణంలో.. 60కిపైగా సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మురిపించాడు అజిత్. వరుస విజయాలతో బాక్సాఫీస్ ముందు జోరు చూపించడమే కాక తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా ఎదిగాడు. తమిళనాడు ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడిగా రెండుసార్లు (2001, 2006లో) అవార్డులు అందుకున్నాడు. ఇప్పుడు పద్మ భూషణ్ అయ్యాడు.