బిగ్‌బాస్ చూసేవాళ్లకు, బిగ్ బాస్ ఇంట్లో వాళ్లకు, బిగ్‌బాస్ షోను ట్రోల్ చేసేవాళ్లకు… సండే అంటే పండగే. ఎందుకంటే సండే ఫండే అంటూ నాగార్జున ఈ రోజు చాలా ఆటలు ఆడిస్తాడు. అలాగే నాలుగో సీజన్ తొలి సండే ఫన్‌డేలోనూ ఆటలాడించాడు. ఒకరు చెబితే అర్థం చేసుకొని ఇంకొకరు బొమ్మలేయడం లాంటి ఆట ఆడించారు. షూట్‌ఔట్ రౌండ్‌లాగా ఒకే పాటకు ఇద్దరిని డ్యాన్స్ కూడా చేయించారు.‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘రాములో రాములా… ’ పాటలో నాగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంట్లో అమ్మాయిలు ఎప్పటిలాగే అందంగా ముస్తాబయ్యారు. ఈ రోజు సండే అనేమో కొందరు అమ్మాయిలు చీరల్లో చితకొట్టారు. ఇంకొందరు ట్రెండీ లుక్‌తో రప్ఫాడించారు. అబ్బాయిలు అయితే డ్యాపర్‌లా దద్దరిల్లించారు. దీని తర్వాత బిగ్‌బాస్ కనెక్ట్ చేసినవాళ్లను కలసి ఓ బొమ్మ గీయమన్నారు. ఒకరు బొమ్మ గీస్తే ఇంకొకరు దాని అర్థం చెప్పాలి.
అందరూ అద్భుతమైన చిత్రకారులు కదా… నాలుగు గీతలు గీసేసి భయపెట్టారు. సూర్యకిరణ్ వేసిన బొమ్మను దేవీ నాగవల్లి ‘వర్ణించలేని వింత అనుభూతి’కి లోనైంది. ‘జాక్ అండ్ జిల్… ’అనే రైమ్‌కి అమ్మ రాజశేఖర్ ‘జాకెట్’ బొమ్మ వేశాడు. సుజాత, మోనాల్ కలసి ఓ బొమ్మ వేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు.. ఎందుకో ఈ రోజు రాత్రి తెలుస్తుంది. ‘మైండ్‌బ్లాక్.. ’ పాటకు దివి, అఖిల్ పోటాపోటీగా డ్యాన్స్ వేశారు. ‘నీతోనే డ్యాన్స్ టునైట్…’ పాటకు హారిక, నోయల్ స్టెప్పులేశారు. మరోవైపు దేవీ నాగవల్లితో డ్యాన్స్ వేయడానికి అందరూ భయపడ్డారు. ఆఖరికి అభిజీత్ వచ్చిన ఆమె డ్యాన్స్‌తో తన డ్యాన్స్‌ను మ్యాచ్ చేయాలని చూశాడు కానీ… వర్కౌట్ అయినట్లు లేదు. కళ్యాణి ‘డింగ్ డాంగ్ బెల్…’ పాటను తన బుర్రకథ స్టైల్‌లో పాడింది. ఆమె పాడుతున్నప్పుడు సూర్యకిరణ్ విచిత్రంగా చూశాడు. ఇంకేముంది కళ్యాణి తన స్టైల్‌లో ‘ఏయ్..’ అంటూ నవ్వేసింది.
లాస్య, సూర్యకిరణ్ కలసి ‘నక్కిలీసు గొలుసు…’ పాటకు ఆటకట్టారు. డ్యాన్స్ వేస్తే నా ప్యాంటు చిరిగిపోతుంది అని అఖిల్ అంటే… ‘మేం అవేమీ పట్టించుకోం’ అని నాగ్ పంచ్ వేశాడు. ‘జిగేల్ రాణి…’ పాటకు మెహబూబ్, మోనాల్ పోటీపడ్డారు. ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు…’ పాటకు గంగవ్వ స్టెప్పులతో అమ్మ రాజశేఖర్ మ్యాచ్ చేయాలని చూశాడు. కానీ వర్కౌట్ అయినట్లు లేదు. ఈ పోటీలో ఎవరు గెలిచారో రాత్రి ఎపిసోడ్‌లో చూడండి.