హీరోయిన్లకు ఒక్క ఫ్లాప్ వస్తే చాలు ఆ తర్వాత అవకాశాల కోసం ఆలోచనలు పెరుగుతాయి అంటారు. పూర్తిగా సినిమా ఛాన్స్‌లు రావు అని చెప్పలేం కానీ.. సినిమాలోకి తీసుకోవాలి అంటే… ‘ఆ హీరోయినా హిట్లు లేవుగా’ అని అంటుంటారు. అయితే ఇదే పరిస్థితి హీరోల విషయంలో కూడా ఉంటుందా? అంటే లేదు అనే చెప్పాలి. అందుకే పదుల సంఖ్యలో ఫ్లాప్‌లు ఇచ్చిన హీరోలు ఆ తర్వాత కూడా ఛాన్స్‌లు సంపాదిస్తున్నారు. ఈ పరిస్థితి ఏ ఒక్క సినిమా ఇండస్ట్రీకో చెందింది కాదు. అన్ని భాషల్లోనూ ఇలాంటి వాళ్లు ఉన్నారు.
ఈ విషయంలో ఏమైనా డౌట్ ఉంటే… మచ్చుక్కు బాలీవుడ్ నుండి ఓ ఉదాహరణ చెబుతాం. అంతేకాదు ఈ ఉదాహరణ కూడా ఆ హీరో తాజాగా చెప్పిన మాటల నుండే వచ్చింది. బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్ (Akshay Kumar) , టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బడేమియా ఛోటేమియా’. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారాన్ని టీమ్ వేగవంతం చేసింది. ఆ క్రమంలోనే తన కెరీర్ గురించి, విజయాల గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఆ మాటలు వైరల్‌గా మారాయి.
మేం సినిమాలు చేస్తాం కానీ, ఫలితాన్ని నిర్ణయించలేం. ఆడియన్స్ మాత్రమే ఆ పని చేయగలరు. నా కెరీర్‌నే తీసుకోండి వరుసగా 16 ఫ్లాప్‌లు వచ్చాయి. అయితే సక్సెస్ వచ్చినా, లేకపోయినా ప్రేక్షకుల్ని అలరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేశాను అని చెప్పాడు. దీంతో అన్ని సినిమాలు వరుసగా పోయినా అవకాశాలు వచ్చాయి అంటే అక్షయ్ అదృష్టవంతుడు అని అంటున్నారు కొందరు.
మరికొందరు మాత్రం అన్ని సినిమాలు పోయినా ఛాన్స్‌లు వచ్చాయంటే దానికి అక్షయ్‌లో ఉన్న టాలెంటే కారణం అని అంటున్నారు. మరికొందరు నెటిజన్లు అయితే కేవలం బాలీవుడ్‌లోనే కాదు… ఇతర ఇండస్ట్రీలోనూ ఇలాంటివాళ్లు ఉన్నారు అని పేర్లు ప్రస్తావిస్తున్నారు. ఏదైతే ఏముంది అన్నేసి సినిమాలు పోయినా హీరోలు హీరోలే అని అక్షయ్ మాటల్లో రుజువైంది.