దర్శకుడిగానే కాకుండా.. నిర్మాతగానూ రాణించారు దివంగత ఈవీవీ సత్యనారాయణ. అభిరుచి ఉన్న నిర్మాతగా ఆయనకు పేరు. మంచి కామెడీ సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్ని బాగా నవ్వించారు. ఆ తర్వాత ఆ నిర్మాణ వారసత్వాన్ని కొడుకులు తీసుకున్నారు. అయితే తొలి ప్రయత్నాల్లో సరైన విజయాలు దక్కకపోవడంతో నిర్మాణాన్ని పక్కనపెట్టారు ఈవీవీ తనయులు. అయితే ఇప్పుడు మళ్లీ నిర్మాణ రంగంలో క్రియాశీలంగా మారాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఈవీవీ తర్వాత ఆ సంస్థ పేరు మీద మంచి సినిమాల్ని తీయాలని అల్లరి నరేష్ అనుకున్నాడు.
నిర్మాతగా అందించిన ‘బందిపోటు’ అనే సినిమా చేస్తే.. అది కాస్త డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాతో నరేష్ చాలా నష్టపోయాడు అంటారు. అంఉదకే ఆ తర్వాత నిర్మాణం జోలికి వెళ్లలేదు. సన్నిహితుల ఎప్పుడైనా ప్రొడక్షన్ పేరు ఎత్తితే ‘ఇప్పట్లో లేదు..’ అని చెప్పేసేవాడట. అయితే ఇప్పుడు మళ్లీ నరేష్‌కు ఈవీవీ బ్యానర్‌ను రీఓపెన్ చేయాలని అనిపిస్తోందట. అయితే పెద్ద తెర కోసం కాకుండా.. ఓటీటీల కోసం ఈవీవీ బ్యానర్‌ను తీసుకురావాలని చూస్తున్నారని టాక్. ఓటీటీల్లో నిర్మాణం సౌలభ్యంగా మారిందని ఆయన భావిస్తున్నారట.
అయితే ఈ సారి నిర్మాణ బాధ్యతలన్నీ సోదరుడు ఆర్యన్ రాజేష్‌కి అప్పగించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. దీని కోసంఓ స్క్రిప్టుని నరేష్ లాక్ కూడా చేశాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావొచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రయత్నం సక్సెస్ అయితే… ఏడాదికి ఓ సినిమా, ఓ వెబ్ సిరీస్ చేయాలని ఈవీవీ తనయులు భావిస్తున్నారని టాక్ నడుస్తోంది టాలీవుడ్‌లో. ‘నాంది’ సినిమాతో నటుడిగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన నరేష్…
తాజా ప్రయత్నంతో నిర్మాతగానూ విజయాల బాట పడతాడేమో చూడాలి. అన్నట్లు మొన్నీ మధ్య ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్ ద్వారా నటుడిగా ఆర్యన్ రాజేశ్ తొలిసారి ఓటీటీలోకి వచ్చాడు. ఆ సిరీస్‌కు మంచి విజయమే దక్కింది అని అంటున్నారు. ఆ అనుభవంతోనే ఈవీవీ తనయులు ఓటీటీలోకి తమ నిర్మాణ సంస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనే మాట కూడా వినిపిస్తోంది.