సినిమా ఇండస్ట్రీకి ఎంతో ప్రీతిపాత్రమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో వచ్చింది అని ఇప్పుడు చాలామంది ఆనందంగా ఉన్నారు. ఇటువైపు సినిమా జనాలు, అటువైపు ప్రేక్షకులు అందరూ ఇదే ఆనందంలో ఉన్నారు. అయితే ఆ ఆనందాన్ని ఓ వేడుకగా చేయాలనే ఆలోచన ఇప్పటి వరకు సినిమా పరిశ్రమ వాళ్లు ఏమీ చేయలేదు. మన సినిమా పెద్దలు వరుసబెట్టి కూటమి నేతలను కలుస్తున్నారు కానీ.. అందరూ కలసి అభినందనలు చెబుదామనే ఆలోచన ఇప్పటివరకు అయితే చేయలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో సరైన టికెట్ ధరలు, ప్రత్యేక షోలు లేకుండా ఇబ్బందులు పడ్డ సినిమా జనాలు ఇప్పుడు తిరిగి గుడ్ డేస్ వచ్చాయి అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు సీఎం కావడం, బాలకృష్ణ (Balakrishna) మరోసారి ఎమ్మెల్యే అవ్వడం, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తొలిసారి గెలిచి డిప్యూటీ సీఎం అవ్వడం లాంటివి ఇండస్ట్రీకి చాలా గర్వకారణం. కనీసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నుండి అయినా అప్రిషియేషన్ ప్రెస్ మీట్, సన్మానం ఉంటాయని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఆ వాసన లేదు.
ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన వారికి ఈ రోజు సాయంత్రం చిన్నసైజ్ ఆనంద సభ ఉండనుంది. ఆ తర్వాత సినిమా మీడియాకు ఫుడ్ ఫెస్ట్ కూడా పెట్టారు. దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హ్యాండిల్ చేస్తోంది. దీంతో ఇండస్ట్రీ బదులు అన్నీ ఆయనే చేస్తున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. గతంలో చిరంజీవి విషయంలోనూ ఇదే జరిగింది అని గుర్తు చేసుకుంటున్నారు. చిరంజీవికి (Chiranjeevi) పద్మ విభూషణ్ వచ్చినప్పుడూ ఇదే జరిగింది.
దేశంలో రెండో అత్యున్నత పురస్కారం చిరంజీవికి వచ్చినప్పుడు తెలుగు సినిమా నుండి ప్రశంసలు వచ్చాయి కానీ.. ఎలాంటి సంబరాలు కనిపించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా కేవలం ప్రశంసలు కనిపిస్తున్నాయి. చూద్దాం పీపుల్ మీడియా ఈవెంట్ తరవాత అయినా ఏమన్నా అలాంటి ఆలోచన చేస్తారేమో చూడాలి.