స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా తెరకెక్కిన పుష్ప మూవీ ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఏపీలో ఈ సినిమా బెనిఫిట్ షోలకు థియేటర్ల ఓనర్లు ప్రయత్నించినా అనుమతులు రాలేదు. అనంతపురం జిల్లాలోని హిందూపురంలో బెనిఫిట్ షో రద్దైనట్టు థియేటర్ యాజమాన్యం ప్రకటించగా ఆ ప్రకటన ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించింది.
పుష్ప బెనిఫిట్ షో వేయకపోవడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. టికెట్లు విక్రయించి షో క్యాన్సిల్ అయిందని చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ థియేటర్ పై రాళ్లు రువ్వారు. థియేటర్ అద్దాలను ధ్వంసం చేశారు. తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్ తమ పవర్ ను చూపించారు. థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. పోలీసులు బన్నీ ఫ్యాన్స్ పై లాఠీఛార్జ్ చేయడం గమనార్హం. పోలీసులు థియేటర్ దగ్గర భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
ఏపీలో బెనిఫిట్ షోలకు, అదనపు షోలకు అనుమతులు ఇవ్వబోమని ఇప్పటికే ప్రభుత్వం తేల్చి చెప్పింది. మరోవైపు ఏపీలో టికెట్ రేట్ల వివాదం కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాలలో పుష్ప బెనిఫిట్ షోలు ప్రదర్శితమవుతుండగా ఏపీలో మాత్రం బెనిఫిట్ షోలకు ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం బన్నీ ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది. అబవ్ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్న పుష్ప సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. పుష్ప సెకండ్ పార్ట్ కు పుష్ప ది రూల్ అనే టైటిల్ ఫిక్స్ అయిందని సమాచారం.
ఏపీలో టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉండటంతో పుష్ప ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే వరకు పుష్పకు పెద్దగా పోటీ లేదనే చెప్పాలి. వచ్చే వారం శ్యామ్ సింగరాయ్ విడుదలవుతున్నా ఆ సినిమా జానర్ డిఫరెంట్ కావడంతో పుష్ప సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పవచ్చు.