కొన్నేళ్ల క్రితం మలయాళంలో విడుదలైన ‘ప్రేమమ్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ప్రేమ కథా చిత్రాల్లో ఇదొక క్లాసిక్ ఫిలిం అనే చెప్పాలి. ఒక్క మళయాళీలనే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా. భాష అర్ధం కాకపోయినా.. సబ్ టైటిల్స్ పెట్టుకొని మరీ చూసేశారు. ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తే.. ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇలాంటి ఒక గొప్ప ప్రేమ కథను అందించిన దర్శకుడు అల్ఫాన్సో పుతెరిన్ ఆరేళ్లకు పైగా సినిమాలు చేయకపోవడం ఆశ్చర్యకరం.
చాలా గ్యాప్ తరువాత అతడు గోల్డ్ అనే సినిమా తీశారు. పృథ్వీరాజ్ సుకుమారన్, నయనతార లాంటి పేరున్న నటీనటులు ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేశారు. అయితే గత నెలలో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. అప్పటినుంచి నెటిజన్లు దర్శకుడు అల్ఫాన్సో పుతెరిన్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటు ట్విట్టర్, అటు ఫేస్ బుక్ లలో హేట్ మెసేజ్ లతో అతడిని వేధిస్తున్నారు. దీంతో బాధ పడిన అల్ఫాన్సో పుతెరిన్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో డీపీని తీసేసి నిరసన వ్యక్తం చేశారు.
ఇలానే ట్రోల్స్ కొనసాగితే సోషల్ మీడియా నుంచి వెళ్లిపోతానని చెప్పారు. ఈ క్రమంలో ఆయనొక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అందులో ఏముందంటే.. ‘మీ తృప్తి కోసం నన్ను ట్రోల్ చేస్తున్నారు. తిడుతున్నారు. నా సినిమా ‘గోల్డ్’ గురించి చెత్తగా మాట్లాడుతున్నారు. ఇలా చేయడం మీకు బాగా అనిపిస్తుందేమో కానీ నాకు కాదు. నా సినిమా నచ్చితే చూడండి. కోపాన్ని చూపించడానికి మాత్రం నా పేజీకి రాకండి.
మీరు అలా చేస్తే నేను సోషల్ మీడియా అకౌంట్స్ ను తొలగిస్తాను. గతంలో మాదిరిగా నేను లేను. నేను అపజయాలు ఎదుర్కొన్నప్పుడు నా భార్య, పిల్లలు, కొంతమంది వ్యక్తులు నాకు అండగా నిలిచారు. పరాజయాలు ఎదురుకావాలని ఎవరూ కోరుకోరు. అది నేచురల్ గా జరుగుతుంటుంది’ అంటూ రాసుకొచ్చారు.