బాలీవుడ్ కురు వృద్ధుడుగా ఉన్న అమితాబ్ బచ్చన్ వయసు 77ఏళ్ళు. ఇప్పటికీ ఆయన ఏడాదికి నాలుగు నుండి ఐదు సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు సేవలు చేస్తున్న అమితాబ్ కి కరోనా సోకిందని తెలియగానే దేశం మొత్తం దిగ్బ్రాంతికి లోనయ్యింది. లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండి ఇంటికే పరిమితమవుతున్న అమితాబచ్చన్ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు అనేక మార్లు సూచనలు చేయడం జరిగింది.
అది ఏమార్గాన ఆయన్ని చేరిందో కానీ, కుటుంబం మొత్తాన్ని ఆవహించింది. అమితాబ్ కుటుంబంలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్య కూడా కరోనా బారినపడ్డారు. ముంబైలోని నానావతి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్, మరియు ప్రజల కొరకు ఓ వీడియో సందేశం పంపారు. ఆ వీడియో సందేశంలో అమితాబ్ డాక్టర్స్ ని తెల్లకోటు వేసుకొని ప్రజల్ని కాపాడుతున్న దేవుళ్లతో పోల్చారు. మనుషుల మనుగడ కోసం అహర్నిశలు పనిచేస్తున్న డాక్టర్స్ మరియు వైద్య సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యంగా నానావతి హాస్పిటల్ లో పనిచేస్తున్న, డాక్టర్స్ మరియు నర్సులను ప్రత్యేకంగా అమితాబ్ ప్రశంసించడం జరిగింది. ఇక ధైర్యంగా ఉండండి అని చెప్పిన అమితాబ్…త్వరలోనే తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబ సభ్యులలో కూడా నలుగురు కరోనా బారిన పడ్డారు.