కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగ్గా ఆడకపోయినా, టీవీల్లో వచ్చినప్పుడు సరిగ్గా చూడకపోయినా ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా ఉండిపోతాయి. బాగా ఆడకపోవడానికి అప్పటి ట్రెండ్‌కు, పరిస్థితులకు ఆ సినిమా సరైనది కాకపోవడం ఒక కారణం అయితే, అనుకున్నట్లుగా రిసీవ్ చేసుకోకపోవడం, ఇప్పుడు వస్తే బాగా ఆడే అవకాశం ఉండటం మరో కారణం. అలాంటి సినిమాల్లో ‘అంజి’ (Anji) ఒకటి. చిరంజీవి (Chiranjeevi) – కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) – మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి (Shyam Prasad Reddy) (కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది.
ఈ సినిమా వివిధ కారణాల వల్ల ఐదేళ్లపాటు షూటింగ్ జరుపుకుంది. థియేటర్లలో సినిమా చూస్తే, ఆ విజువల్స్ చూస్తే భలే అనిపిస్తుంది. అయితే కంప్లీట్ ప్యాకేజీగా సినిమా రాణించలేకపోయింది అనుకోండి. ఈ సినిమా గురించి దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ చాలా సార్లు మాట్లాడారు. అందులో కొన్ని విషయాలు వింటుంటేనే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందులో కొన్ని ఇవీ. సినిమా విరామ సన్నివేశాన్ని నెల రోజులు షూట్ చేశారట. అన్ని రోజులూ చిరంజీవి ఎంతో ఓపిగ్గా నటించారట.
కొన్ని సన్నివేశాలకు 120 షాట్లు తీశారట. గ్రాఫిక్స్ వర్క్ కోసం సింగపూర్, మలేషియా, అమెరికాలో టీమ్‌లు పని చేసేవట. ఉదయం నుండి సాయంత్రం వరకు తీసిన షాట్స్ రాత్రికి అమెరికా పంపేవాళ్లట. ఆ డిస్క్‌లోని షాట్స్ తీసుకుని మళ్లీ అదే రోజు ఆ డిస్క్‌లను తిరిగి ఇక్కడకు పంపేవారట. గ్రాఫిక్స్ కోసం చిరంజీవి డ్రెస్‌కు మార్కులు పెట్టేవారట. దాంతో ఆ సీన్స్ షూట్ చేసిననన్ని రోజులు ఆయన అదే డ్రెస్ వేసుకున్నారట. ఉతకడానికి కూడా అయ్యేది కాదట.
అలాగే సినిమా మొదట్లో ఆత్మలింగం తీసుకోవడానికి ప్రయత్నించే ఒక మాంత్రికుడు కనిపిస్తాడు. అతను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి దగ్గర అడ్డుక్కునే వ్యక్తి అట. చూడగానే సరిపోతాడు అనిపించి ఆ పాత్ర చేయించారట. ఈ సినిమా ఈ రోజుల్లో కాస్త నాణ్యత పెంచి, నిడివి తగ్గించి రిలీజ్ చేస్తే అదిరిపోతుంది అనే వాదనలూ ఉన్నాయి. మరి మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి ఏమంటారో ఈ విషయంలో?