సూపర్ స్టార్ కృష్ణ ‘సింహాసనం’ సినిమా చూశారా? 35 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా ఇప్పటితరానికి తెలియడం కష్టమే కానీ… ఆ సినిమా గొప్పతనం గురించి తెలిశాక ఆ సినిమా చూడకుండా ఉండటం అంతే కష్టం. ఈ వార్త అంతా చదివాక సినిమా చూడాలనిపిస్తే.. యూట్యూబ్‌లోకి వెళ్లి ఓ లుక్కేయొచ్చు. 1 మిలియన్ వ్యూస్‌లో సినిమా ఉంటుంది. సినిమా గొప్పతనం గురించి చెప్పాలి అంటే… ముందుగా రెండు విషయాలు చెప్పుకోవాలి.
ఒకటి ఆ సినిమాకు దర్శకుడు, ఎడిటర్, నిర్మాత సూపర్‌స్టార్ కృష్ణనే. అంతేకాదు తెలుగులో 70 ఎంఎం స్టీరియోఫోనిక్ సౌండ్ సినిమా కూడా ఇదే. ఈ సినిమా ఘనత గురించి ఇప్పుడు చెప్పుకుంటే… సింపుల్‌గా 80లకాలం నాటి ‘బాహుబలి’ అని చెప్పొచ్చు. సినిమా గ్రాండియర్ విషయంలో కానీ, వసూళ్ల విషయంలో కానీ, రికార్డుల విషయంలో కానీ… ఇలా ఏం చూసిన అద్భుతహః అనిపించకమానదు. అందులో మచ్చుకు కొన్ని చూద్దాం. సినిమా విడుదలైన తొలి రోజుల్లో టికెట్‌ల కోసం 12 కి.మీ మేర క్యూలైన్ ఉండిందట.
అలాగే ఆ రోజుల్లో ₹3.5 కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేస్తే ₹5 కోట్లు వసూలు చేసిందట. సినిమా వంద రోజుల వేడుకను చెన్నైలో నిర్వహించారు. ఆ వేడుకకు కృష్ణ అభిమానులు సుమారు 400 బస్సుల్లో నగరానికి చేరుకున్నారట. ఇవి కొన్ని మాత్రమే ఆ రోజుల్లో థియేటర్ల అభిమానుల సందడి గురించి… ఇప్పటికీ నాటితరం సినిమా అభిమానులు కథలు కథలుగా చెబుతుంటారు.