ఓ పక్క ‘జబర్దస్త్’ షో లో పాల్గొంటూనే మరోపక్క తన పాత్రకి ప్రాధాన్యత ఉండే సినిమాల్ని ఎంచుకుంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంటుంది అనసూయ. ఈమె తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్నకు క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే కంగారుగా ట్వీట్ చేసేసి.. ట్రోలింగ్ కు గురవ్వడం.. అటు తరువాత క్షమాపణలు చెప్పడం ఈమెకు అలవాటే..!
విషయం ఏంటంటే.. “నల్లమల అడవుల్లో ‘యురేనియం’ వెలికితీత పై తాజాగా తన ట్విట్టర్ ద్వారా నిరసన వ్యక్తం చేసింది అనసూయ. ‘విద్యుత్తు ఉత్పత్తి కోసం నల్లమల అడవులను నాశనం చెయ్యొద్దు. స్వచ్ఛమైన గాలిని ప్రసాదించే చెట్లను చంపేస్తే… భవిష్యత్తులో పీల్చడానికి గాలే ఉండదు. యురేనియం తవ్వకాలను ఎలా అనుమతిస్తారు సార్? ఆలోచించడానికే భయం వేస్తోంది’ అంటూ తెలంగాణ మాజీ మంత్రి జోగు రామన్న, ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ లను ట్యాగ్ చేసింది. అయితే వెంటనే తన తప్పును గుర్తించి, సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. అటవీశాఖ మంత్రిగా గతంలో ఉన్న జోగు రామన్నకు ఈసారి ఆ పదవి దక్కలేదు. దీంతో, ‘జోగు రామన్న గారు నన్ను క్షమించండి. కరెంట్ అఫైర్స్ పై నాకు పట్టు లేదు. ఈ అభిప్రాయాలను ప్రస్తుత తెలంగాణ అటవీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫార్వర్డ్ చేస్తున్నాను… దయచేసి నా ఆవేదనను అర్థం చేసుకోండి అంటూ కోరింది. ‘నల్లమల అడవులను కాపాడుదాం’ అంటూ విన్నవించింది. ఏమైనా ఈసారి మాత్రం ట్రోలింగ్ కు గురవ్వకుండానే జాగ్రత్త పడింది రంగమ్మత్త.