మూడు గంటల సినిమాల్ని థియేటర్లలో చూడలేం, చూసేవాళ్లు లేరు అని అనుకునేటప్పుడల్లా ఓ సినిమా వస్తూ ఉంటుంది. మూడు గంటలకుపైగా నిడివితో వచ్చే ఆ సినిమా అనూహ్య విజయం సాధిస్తుంటుంది. దీంతో అలా మూడు గంటల సినిమాలు ఇంకా ఉన్నాయి. అయితే కొన్ని మాత్రం ఇలా వచ్చి బొక్క బోర్లా పడుతున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మరో సినిమా అలా వస్తోంది. అదే ‘యానిమల్’. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందిన సినిమా ఇది.
ఈ సినిమా నిడివి గురించి ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. అలాగే అంత పెద్ద సినిమా ఎందుకు రెడీ చేయాల్సి వచ్చింది అనే విషయం కూడా టీమ్ చెప్పేసింది. అయితే సినిమా నిడివి గురించి వచ్చిన వార్తల్లో ఓ ట్విస్ట్ ఉందట. అందరూ అనుకుంటున్నట్లు, సినిమా టీమ్ చెప్పినట్లు నిడివి మూడు గంటల 21 నిమిషాలు కాదట. మొత్తం నిడివి మూడు గంటల 49 నిమిషాలట. ఈ విషయాన్ని హీరో రణ్‌బీర్ కపూరే చెప్పాడు. అయితే థియేటర్లలో మాత్రం సెన్సార్ అయితే 3.21 గంటల సినిమానే చూపిస్తారట.
‘యానిమల్’ (Animal Movie) సినిమా డిసెంబరు 1న థియేటర్స్‌లోకి రాబోతోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ కట్ పూర్తయ్యే సమయానికి రన్‌టైమ్ ఏకంగా 3 గంటల 49 నిమిషాలుగా ఉందట. ఇంత రన్‌టైమ్‌తో థియేటర్స్‌లో ప్రదర్శించడం కష్టం అని భావించారట. అలా చేస్తే రెండు ఇంటర్వెల్స్ ఇవ్వాల్సిందే అని అనుకున్నారట. దాంతోపాటు అంతసేపు థియేటర్‌లో సినిమా చూడటం అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు అని అనుకున్నారట. దీంతో అతికష్టమ్మీద 3 గంటలా 21 నిమిషాలకు కుదించారట.
నిడివి కారణంగా తాము చెప్పాలనుకున్న చాలా విషయాలను దర్శకులు తెరపై చూపించలేకపోతున్నారు. అలాంటి వారికి ఓటీటీ వెర్షన్ మంచి ఉపయోగకరంగా ఉంది. దీంతో ‘యానిమల్’ కూడా ఓటీటీలో అలానే వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలోకి రావొచ్చు. అప్పుడు ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.