రెండు పెద్ద సినిమాలు… అందులోనూ చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి వస్తే.. కిక్ ఎలా ఉంటుందో మొన్నీమధ్యే చూశారు? మళ్లీ అలాంటి కిక్‌ను ఫీల్ అవ్వాలని అనుకుంటున్నారా? అయితే కాస్త గట్టిగా అనుకోండి.. ఎందుకంటే అలాంటి పరిస్థితి మళ్లీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాంటి ఇంట్రెస్టింగ్ ఫైట్‌కు ఈ సారి విజయదశమి వేదిక కావొచ్చు అని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగి.. సినిమాలు ముందుకెళ్తే దసరాకు సినిమాల సరదా ఉండబోతోంది.
టాలీవుడ్‌కు ఉండే పర్‌ఫెక్ట్ సీజన్లు అంటే… సంక్రాంతి, సమ్మర్, దసరా. ఈ సమయాల్లో పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. కారణం సెలవులు ఎక్కువగా ఉండటం, ప్రేక్షకులకు సినిమా మూడ్ ఉండటం. అలాంటి వాటిలో సంక్రాంతికి వీర సింహా రెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య ఫైట్ అదిరిపోయింది. ఎవరి వసూళ్లు ఎక్కువ అనే లెక్కల్లోకి ఇప్పుడు మేం వెళ్లం కానీ.. ఫ్యాన్స్, ప్రేక్షకులకు అయితే ఫుల్ కిక్ వచ్చింది అని చెప్పాలి. అలాంటి పరిస్థితి వచ్చే విజయదశమికి ఉండొచ్చు అని ప్రాథమిక అంచనా.
చిరంజీవి – మెహర్ రమేశ్ ‘భోళా శంకర్’ సమ్మర్ నుండి దసరాకు మారింది అంటున్నారు. పవన్ కల్యాణ్ – క్రిష్‌ల ‘హరి హర వీరమల్లు’ కూడా సమ్మర్ టు అక్టోబరు అని టాక్. ఇక బాలకృష్ణ – అనిల్ రావిపూడి కొత్త సినిమా కూడా దసరా కానుకే అంటున్నారు. మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమా టీమ్ కూడా దసరా డేట్ మీద కన్నేసింది. వీటిలో ఏ సినిమాలు నిలుస్తాయో ఇప్పుడే చెప్పలేం కానీ.. మెగా వర్సెస్ నందమూరి పక్కా అని మాత్రం అంటున్నారు.
ఎందుకంటే పవన్ కల్యాణ్, మహేష్‌బాబు సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో మళ్లీ సంక్రాంతి సినిమా వార్ దసరాకు చూడొచ్చు అని విశ్లేషకులు లెక్కేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ఒకే ఏడాదిలో చిరు – బాలయ్య సినిమాల పోటీ రెండుసార్లు రావడం మాత్రం ఆసక్తికరం. మరి ఏమవుతుందో చూడాలి.