దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమోళి తెరకెక్కించిన అద్భుత కళాఖండం బాహుబలి కంక్లూజన్ కురిపించిన కలక్షన్ల వర్షం ఆగిపోయినా… అవార్డుల జోరు మాత్రం తగ్గడం లేదు. ప్రభాస్, రానా, అనుష్క, నాజర్, సత్యరాజ్, రమ్య కృష్ణ తదితరులు పోటీపడి నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లు కొల్లగొట్టింది. బుల్లితెరపైనా కూడా టీఆర్పీ లో రికార్డు సృష్టించింది. జపాన్ లో విడుదలైన ఈ మూవీ అక్కడి వారికీ ఆకట్టుకొని వందరోజుల వేడుకను జరుపుకుంది. ఈ సినిమా అడుగు పెట్టిన చోటల్లా రికార్డులను తీసుకొస్తోంది. ఇప్పటికే జాతీయ అవార్డులతో పాటు ప్రముఖ సంస్థలనుంచి అనేక విభాగాల్లో అవార్డులు అందుకున్న ఈ సినిమా మరో అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకుంది.
ఏటా వివిధ జానర్‌లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలకు అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ అండ్ హారర్ ఫిల్మ్స్ అనే సంస్థ శాటరన్ అవార్డులను అందజేస్తుంది. ఫిబ్రవరి 2017 నుంచి ఫిబ్రవరి 2018 మధ్య విడుదలైన చిత్రాల్లో విశేషంగా ప్రేక్షకులను అలరించిన వాటికి ఈ అవార్డులను ప్రదానం చేసింది. బుధవారం జరిగిన 44వ శాటరన్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ ‘ఉత్తమ అంతర్జాతీయ చిత్రం’ కేటగిరీలో అవార్డును సొంతం చేసుకుంది. ఈ కేటగిరీలో మొత్తం ఆరు చిత్రాలు పోటీ పడగా, ‘బాహుబలి2’కు అవార్డు కైవశం చేసుకుంది. దీంతో బాహుబలి చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది.