అప్పట్లో సినిమాలు ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడే సగం బిజినెస్ అయిపోయేదట. కథ విన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కొంత మొత్తాన్ని నిర్మాతలకు ఇచ్చేవారట. ఆ డబ్బులతోనే షూటింగ్ ఫినిష్ చేసేవారట. తర్వాత పరిస్థితులు మారిపోయాయి. సినిమా పూర్తయ్యాక కూడా పట్టించుకొనేవారు లేకుండాపోయారు. మళ్ళీ ఈమధ్యకాలంలో సినిమా ప్రొడక్షన్ దశలో ఉండగానే బిజినెస్ అవ్వడం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రమైన “అజ్ణాతవాసి” శాటిలైట్ రైట్స్ ను ఏకంగా 19 కోట్లకు కొన్నారు. ఇప్పుడు ఈ రికార్డ్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేస్తున్నాడు.
త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న “అరవింద సమేత వీర రాఘవ” చిత్రం శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు సంస్థ దాదాపు 23 కోట్ల రూపాయలకు కొన్నదని వినికిడి. జీ సంస్థ కొన్నదంటే.. అందులో హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా కలపబడతాయి కాబట్టి.. “అరవింద సమేత” తెలుగు-హిందీ శాటిలైట్ రైట్స్ 23 కోట్ల రూపాయలకు జీ సంస్థ కొనేసిందని చెప్పుకోవచ్చు. శాటిలైట్ రైట్స్ కి 23 కోట్లు అనేది చిన్న విషయం కాదు. ఇది హీరోగా ఎన్టీఆర్ స్టామినా ఏంటి అనేది ప్రూవ్ చేస్తూ.. అతడి స్థాయిని మరింత పెంచే విషయం.