ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు హిట్ టాక్ తో కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుంటే మరికొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించడం లేదు. టికెట్ రేట్లు తగ్గిస్తున్న నిర్మాతలకు కొంతమేర బెనిఫిట్ కలుగుతుందని ఇప్పటికే రిలీజైన మేజర్ సినిమాతో ప్రూవ్ అయింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తున్న రేట్లతో పోలిస్తే తక్కువ టికెట్ రేట్లు ఈ సినిమాకు అమలయ్యాయి.
జులై 1వ తేదీన విడుదల కానున్న పక్కా కమర్షియల్ సినిమా కూడా తక్కువ టికెట్ రేట్లతోనే థియేటర్లలో ప్రదర్శితం కానున్న సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకులు మాత్రం టికెట్ రేట్లు తగ్గిస్తే సరిపోదని కూల్ డ్రింక్స్ రేట్లు, స్నాక్స్ రేట్లు కూడా తగ్గిస్తే బెనిఫిట్ కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ లోని పలు మల్టీప్లెక్స్ లలో టికెట్ రేట్లతో పోల్చి చూస్తే స్నాక్స్ కు ఎక్కువ మొత్తం ఖర్చవుతోంది. ఏషియన్ గ్రూప్ మల్టీప్లెక్స్ లలో మాత్రమే స్నాక్స్ రేట్లు కొంతమేర తక్కువగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మరి నిర్మాతలు ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది. ఓటీటీల ద్వారా ప్రేక్షకులు కోరుకున్న వినోదం దక్కుతుండటంతో థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ స్నాక్స్ రేట్ల వల్లే చాలామంది ఓటీటీలలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. నిర్మాతలు స్నాక్స్ రేట్లను తగ్గించే దిశగా థియేటర్ల యాజమాన్యాలతో చర్చించి నిర్ణయాలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో సింగిల్ స్క్రీన్స్ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంటుంది.
గత శుక్రవారం రోజున ఎనిమిది చిన్న సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఒక్క సినిమా కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రేక్షకుల్లో గుర్తింపును సొంతం చేసుకున్న నటులకు సైతం ఇదే పరిస్థితి ఎదురవుతోంది. హీరోలు, దర్శకులు రెమ్యునరేషన్లను తగ్గించుకుంటే ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని చెప్పవచ్చు.