రీరిలీజ్ అనగానే ప్రేక్షకులకు ఎందుకో తెలియని ఆనందంగా వేసేస్తుంది. అందుకే ఈ ట్రెండ్ ఎక్కువవుతోంది. ఈ క్రమంలో నిర్మాతలు కూడా ఈ దిశగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. పనిలో పనిగా తమ టాలెంట్‌ని ప్రదర్శిస్తూ సినిమాను మళ్లీ చూసే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలా ఇప్పుడు రాజమౌళి అండ్ కో. కూడా కొత్త ఆలోచన చేసింది. ‘బాహుబలి’ సినిమాను మరోసారి రిలీజ్ చేయబోతోంది.
‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ కలిపేసి ‘బాహుబలి: ఎపిక్’ అని రిలీజ్ చేయబోతోంది. సినిమా రెండు పార్టుల్ని కలిపి ఒక్కటే చేసి విడుదల చేస్తున్నారు. నిడివి కాస్త ఎక్కువైనా రెండూ కలిపి రిలీజ్ చేస్తే ప్రేక్షకుడికి కొత్త అనుభూతిచ్చినట్లు అవుతుంది అని రాజమౌళి అండ్ టీమ్ ఆలోచించారు. అందుకే ఈ ప్రయోగం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాజమౌళి టీమ్‌లో కొంతమంది ఈ పని మీద ఉన్నారు.
రెండు సినిమాలను ఒక్క సినిమాగా మార్చే ఎడిటింగ్ చేశారు. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ కలిపితే మొత్తంగా 5 గంటల 40 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు దానిని సుమారు మూడున్నర గంటలకు కుదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అని చెబుతున్నారు. ఒకవేళ అంతకుమించి వస్తే.. రెండు ఇంటర్వెల్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. అయితే మూడున్నర గంటల నిడివికే అందరూ ఒకే అవుతున్నారు అని సమాచారం.
అసలు విషయం తేలాలంటే అక్టోబరు 31 రావాల్సిందే. ఆ రోజు ‘ఎపిక్’ థియేటర్లలోకి వస్తుంది. అయితే ఇక్కడే ఒక డౌట్. ఇంతలా సినిమాలో కొన్ని సీన్స్ తీసేసే అవకాశం ఉండి.. తక్కువ నిడివి చేసి ఉంటే అవకాశం ఉంటే ఎందుకు అప్పుడు రెండు ముక్కలు చేయడం అని. ‘ఎపిక్’ ప్రచారానికి రాజమౌళి వస్తే కచ్చితంగా ఈ ప్రశ్న అయితే ఎదురవుతుంది. చూద్దాం అప్పుడేమంటారో?