దిల్ రాజు ఫ్యాక్టరీ నుండి వచ్చిన చిన్న సినిమా ‘బలగం’. మార్చి 3న రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే. ‘జబర్దస్త్’ కమెడియన్ వేణు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా కథ పై కాంట్రవర్సీ ఏర్పడినప్పటికీ… ఈ చిన్న సినిమాకి అదే పెద్ద పబ్లిసిటీ అయ్యింది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ చిత్రం తెలంగాణ గ్రామీణ సంస్కృతి, కట్టుబాట్లను కళ్ళకు కట్టినట్టు చూపించారు.
‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. చిన్న సినిమా అయినప్పటికీ దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసిన తీరు అందరినీ మెప్పించింది. ఇప్పటివరకు ఈ మూవీ రూ.20 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ‘బలగం’ చిత్రం త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయ్యింది.
అందుతున్న సమాచారం ప్రకారం.. ‘బలగం’ చిత్రం ఏప్రిల్ 7 లేదా ఏప్రిల్ 8 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను రూ.4 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. నిజానికి ‘బలగం’ చిత్రాన్ని రూ.3 కోట్ల బడ్జెట్లోనే ఫినిష్ చేశారు. నేరుగా ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇస్తానంటే రూ.5 కోట్లు చెల్లిస్తామని ‘ఆహా’ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ సంస్థలు ఎగబడ్డాయి.
కానీ దిల్ రాజు మాత్రం తన హ్యాండోవర్ లో ఉన్న 47 థియేటర్లలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. వీకెండ్ కు ఆ లెక్క పెరిగింది. రెండో వీకెండ్ కు ఆ లెక్క ఇంకా పెరిగింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ మూవీ 7 రెట్లు ప్రాఫిట్స్ ను అందించింది. మరి ఓటీటీలో అంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.