నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ తరుణంలో, మరో హిట్ కాంబినేషన్ సెటప్ అవుతోందని సమాచారం. 2023 సంక్రాంతికి విడుదలైన వీరసింహా రెడ్డి తో బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించిన బాలయ్య, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ తెరపైకి రావడంతో అభిమానుల్లో హైప్ పెరిగిపోయింది.
Balakrishna
గతంలో వీరసింహా రెడ్డి సినిమాలో గోపిచంద్ మలినేని స్టైలిష్ మేకింగ్, బాలయ్య మాస్ అప్పీల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ వార్త అభిమానుల్లో భారీ అంచనాలు కలిగిస్తోంది. ప్రస్తుతానికి బాలకృష్ణ అఖండ 2 షూటింగ్‌లో బిజీగా ఉండగా, గోపిచంద్ మలినేని సన్నీ డియోల్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ జాట్ ను తెరకెక్కిస్తున్నారు.
ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తైన తర్వాత గోపిచంద్ మలినేని, బాలయ్య మరోసారి కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త చిత్రాన్ని 2025 సమ్మర్‌లో ప్రారంభించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. కథకు సంబంధించిన వివరాలు గోపిచంద్ మలినేని ఇప్పటికే బాలయ్యకు వినిపించగా, అతని నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందట. ఇక నిర్మాతల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. చెరుకూరి సుధాకర్, సతీష్ కిలారు వంటి ప్రముఖ నిర్మాతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
చెరుకూరి సుధాకర్ ప్రస్తుతం మోక్షజ్ఞ కోసం ఓ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నప్పటికీ, అది ఆలస్యం కావడంతో ఈ చిత్రం ఆ బేనర్‌లో ఉండే అవకాశం ఉంది. మరోవైపు సతీష్ కిలారు ప్రస్తుతం బుచ్చిబాబు రామ్ చరణ్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టగా, అది పూర్తైన తర్వాత ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను చేపట్టే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.