తెలుగు చిత్రసీమలో కొంతకాలంగా పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతోంది. భారీ బడ్జెట్ సినిమాలు, విభిన్నమైన కథాంశాలతో సౌత్ ఇండస్ట్రీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న వేళ, తమిళ దర్శకులు టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, ఈ ప్రయోగాలు ఆశించిన ఫలితాలను అందించలేకపోయాయి. రీసెంట్‌గా విడుదలైన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ ఈ జాబితాలో చేరడం గమనార్హం.
శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను చవిచూసింది. ఇది శంకర్‌కి టాలీవుడ్‌లో మొదటి సినిమా కావడం విశేషం. అలాగే, నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కస్టడీ’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ కావాల్సిన ఈ బైలింగ్వల్ చిత్రం, చైతన్యకు కోలీవుడ్ డెబ్యూ. కానీ, ఈ ప్రయోగం ఆశించిన విజయాన్ని అందించలేదు.
అలాగే రామ్ పోతినేని, తమిళ దర్శకుడు ఎన్. లింగుస్వామి కాంబినేషన్‌లో వచ్చిన ‘ది వారియర్’ కూడా ఘోరంగా నిరాశపరిచింది. మాస్ ఎలిమెంట్స్ ఉన్నా, ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోయింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’ కూడా రీమేక్‌గా వచ్చి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమాకు దర్శకుడు సముద్రఖని కావడం విశేషం. అంతకు ముందే ఈ డైరెక్టర్ చేసిన ‘శంభో శివ శంభో’, ‘జెండాపై కపిరాజు’ లాంటి చిత్రాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.
విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ (ఆనంద్ శంకర్ దర్శకత్వం) కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అలానే ప్రభాస్ నటించిన ‘రెబల్’ సినిమాతో రాఘవ లారెన్స్ డైరెక్షన్‌లో బిగ్ డిజాస్టర్ అయ్యింది. ఇక మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ కోలీవుడ్ దర్శకులతో చేదు అనుభవాలను పొందారు. మహేశ్ నటించిన ‘స్పైడర్’ (మురుగదాస్ దర్శకత్వంలో) భారీ అంచనాల మధ్య రాగా, ఫలితం నిరాశగా మారింది. అలాగే పవన్ కళ్యాణ్ ‘పంజా’, ‘బంగారం’ వంటి చిత్రాలు కూడా తమిళ దర్శకులతో చేసినవి. ఇవన్నీ దర్శకులకు, హీరోలకు ఎదురు దెబ్బలుగా మారాయి.