సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లకు సొంత నిర్మాణ సంస్థలున్నాయి. వెంకీ సురేష్ ప్రొడక్షన్స్, నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో చిత్రాలను నిర్మిస్తుంటే.. చిరంజీవికి గీతా ఆర్ట్స్, అంజనా ప్రొడక్షన్, కొణిదెల ప్రొడక్షన్స్ అంటూ మూడు బ్యానర్లు ఉన్నాయి. బాలకృష్ణ సోదరులకు ( రామకృష్ణ సినీ స్టూడియోస్) నిర్మాణ సంస్థ ఉన్నప్పటికీ అతను మాత్రం నిర్మాణం జోలికి వెళ్ళలేదు. కానీ తొలిసారి ఆ అడుగు వేయబోతున్నారు. తన తండ్రి నందమూరి తారకరామారావు బయోపిక్ ని సొంత బ్యానర్లో నిర్మించాలని సంకల్పించుకున్నారు.
అందుకే తన ఇద్దరు కూతుళ్లు బ్రహ్మణి, తేజస్వి పేర్లు కలిసేలా బ్రహ్మతేజా ప్రొడక్షన్ అనే పేరును కూడా బ్యానర్ కోసం ఖరారు చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. మహానటుడు ఎన్టీఆర్ నిజజీవితాన్ని వెండితెరపై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలని ఉద్దేశంతో బాలయ్య ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మూవీ కోసం కొన్ని నెలలలుగా డైరక్టర్ తేజ పరిశోధిస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకపూర్వం జరిగిన సంఘటనలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన వెంటనే ఈ మూవీ పట్టాలెక్కనుంది.