రానున్న సంక్రాంతి సీజన్‌కి వచ్చే సినిమాలేంటి అనే విషయంలో క్లారిటీ వచ్చినట్లే ఉంటోంది. కానీ క్లారిటీ రావడం లేదు. కారణం నాగార్జున – నాగచైతన్యల ‘బంగార్రాజు’ దూకుడే. అదేదో మరో నెలలో సినిమా ఉంది అన్నట్లుగా ప్రచారం మొదలుపెట్టేశారు. ఎందుకా అని ఆరా తీస్తే సంక్రాంతికే వచ్చేస్తారు అనే టాక్ వినిపిస్తోంది. దీంతో సంక్రాంతి బరి మరోసారి లెక్కల తేలేలా కనిపించడం లేదు. దీనిపై అర్జెంట్‌గా క్లారిటీ కావాలి. నిజానికి సంక్రాంతి బరిలో ఉండే సినిమాలు అంటూ మూడు నెలల క్రితమే క్లారిటీ వచ్చేసింది.
‘రాధేశ్యామ్’, ‘సర్కారు వారి పాట’, ‘భీమ్లా నాయక్’, ‘ఎఫ్ 3’ సినిమాలు సంక్రాంతికి రావాలి. దీంతో నాలుగు పెద్ద సినిమాల సందడి పక్కా అనుకున్నారు. ఇంతలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ రయ్యిమంటూ దూసుకొచ్చింది. జనవరి 7న విడుదల చేస్తాం అని చెప్పారు. దీంతో మిగిలిన సినిమాలు పక్కకే అనుకున్నారు. కానీ ‘ఎఫ్ 3’, ‘సర్కారు వారి పాట’ మాత్రమే వాయిదా పడ్డాయి. దీంతో సంక్రాంతి బరి లెక్క తేలింది అనుకుంటుండగా… ‘బంగార్రాజు’ వచ్చేస్తున్నా అన్నాడు.
సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేస్తాం అని బలంగా చెప్పకపోయినా… ప్రచార శైలి చూస్తుంటే మాత్రం అదే అనిపిస్తోంది. పెద్ద సినిమాలు రిలీజ్ డేట్‌లు ప్రకటించి ప్రచారం చేస్తుంటే… ‘బంగార్రాజు’ మాత్రం రిలీజ్ డేట్ లేకుండా ప్రచారం చేస్తున్నారు. అయితే జనవరి 15న సినిమా విడుదల పక్కా అని అంటున్నారు.